సూర్యాపేట జిల్లా మండలం రత్నవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కీసర్ జితేందర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రత్నవరం గ్రామ బిడ్డగా, మాజీ ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు ఆయనను స్మరించుకున్నారు.
మహనీయులైన టైగర్ కీసర జితేందర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ, ఈ రోజు తమకు బాధాకరమైన రోజని పలువురు అన్నారు. రత్నవరం గ్రామ ముద్దుబిడ్డ, హుజూర్నగర్-కోదాడ సమితి మాజీ ప్రెసిడెంట్, మాజీ శాసనసభ్యులు, కీర్తిశేషులు శ్రీ టైగర్ కీసర జితేందర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. జితేందర్ రెడ్డి గారు ఒక పేరు కాదు, ఒక చరిత్ర అని కొనియాడారు.
రత్నవరం అనే చిన్న గ్రామం నుండి బయలుదేరి, సమితి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా ఎదిగిన నాయకుడు కీసర జితేందర్ రెడ్డి. అధికారం ఆయనకు అలంకారం కాదు, బాధ్యత అని పేర్కొన్నారు. ఆయన హయాంలో మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టారు, ఏ ఇంట్లో కష్టం వచ్చినా ముందుండి నిలబడ్డారు. పార్టీలకు, కులాలకు అతీతంగా అందరినీ ఆదుకున్న మహానాయకుడు అని తెలిపారు.
ఈ రోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన వేసిన బాట, చూపించిన మార్గం, ఆశయాలు మన మధ్యే ఉన్నాయని అన్నారు. మనం చేయాల్సింది ఆయన ఆశయాలను కొనసాగించడమేనని, పేదవాడికి అండగా నిలబడటమే ఆయనకు మనం చేయగల నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ వర్ధంతి సందర్భంగా రత్నవరం గడ్డపై పుట్టిన ఆ మహానాయకుడికి, రేణు కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మిరియాల శ్రీను, అందరి తరపున పూలమాలలు, కొవ్వొత్తుల వెలుగులతో, కొబ్బరికాయతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పగడాల రామిరెడ్డి, ఎరగని వీరబాబు, మిరియాల గురుస్వామి, నరసింహ, సత్యం, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
జోహార్ కీసర జితేందర్ రెడ్డి గారికి అంటూ పలువురు ఆయనకు నివాళులు అర్పించారు.












