రంగారెడ్డి, 12 November
బీసీ సమాజ హక్కుల సాధన కోసం తరతరాలుగా సాగుతున్న పోరాట ప్రస్థానం భారత సామాజిక చరిత్రలో చెరగని అధ్యాయమని జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర అప్ప పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే నుంచి ఛత్రపతి సాహూ మహారాజ్, పెరియార్, మండల్ కమిషన్ వరకు సాగిన ఉద్యమాలు బహుజన సమాజంలో విద్య, ఆత్మగౌరవం, సామాజిక సమానత్వానికి బలమైన పునాదులు వేశాయని ఆయన తెలిపారు. మహనీయుల పోరాట స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకొని బీసీ హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. కులవివక్షకు వ్యతిరేకంగా, బహుజనులకు విద్య అందించేందుకు మహాత్మా జ్యోతిరావు ఫూలే చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, మహిళా విద్యకు సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలు సమాజ మార్పునకు మార్గదర్శకంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. ఛత్రపతి సాహూ మహారాజ్ వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయానికి బాటలు వేయగా, పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమం అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని నింపిందని ఆయన అన్నారు. ఈ మహనీయుల పోరాటాలే నేటి బీసీ ఉద్యమానికి స్ఫూర్తిదాయక పునాదులని ఆయన వివరించారు.
1979లో ఏర్పాటైన రెండో వెనుకబడిన తరగతుల కమిషన్కు బీపీ మండల్ అధ్యక్షత వహించారని, 1980లో సమర్పించిన నివేదికలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేశారని ఆయన గుర్తుచేశారు. 1990లో అప్పటి ప్రధాని వి.పి. సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫార్సుల అమలుకు నిర్ణయం తీసుకోవడం దేశ సామాజిక, రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందని ఆయన అన్నారు. కాకా కాలేల్కర్, కర్పూరి ఠాకూర్, గౌతు లచ్చన్న, కృష్ణస్వామి ముదిరాజ్ వంటి నాయకులు కూడా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీ హక్కులు, రిజర్వేషన్లు, కులగణన, రాజకీయ ప్రాతినిధ్యం కోసం సాగుతున్న ఉద్యమాలు ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయని ఆయన తెలిపారు. నేటి పరిస్థితుల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సముచిత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర అప్ప అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టడం, విద్యా అవకాశాలను విస్తరించడం, యువతకు ఉపాధి కల్పించడం, రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడం ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని ఆయన సూచించారు.
బీసీ కులాల మధ్య ఉన్న చిన్నచిన్న విభేదాలు ఉద్యమ ఐక్యతకు ఆటంకం కలిగించకూడదని, అన్ని బీసీ కులాలు ఒకే వేదికపైకి వచ్చి హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని, మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని ఆయన కోరారు. మహనీయుల చరిత్రను ప్రతి ఇంటికీ, ప్రతి తరానికీ చేరవేయాల్సిన బాధ్యత బీసీ సంఘాలపై ఉందని ఆయన అన్నారు. బీసీలకు విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఆర్థిక స్వావలంబనతో పాటు రాజకీయ ప్రాతినిధ్యం లభించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. మహనీయుల త్యాగాలను కేవలం జయంతులు, వర్ధంతులకే పరిమితం చేయకుండా వారి ఆశయాల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల ఐక్యతే బలం, విద్యే భవిష్యత్తు, ఆత్మగౌరవమే లక్ష్యం, హక్కుల సాధనే ఉద్యమం అనే నినాదంతో సామాజిక న్యాయ పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర అప్ప ఆకాంక్షించారు.







