రంగారెడ్డి, 9 November
రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్) బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని విజ్ఞాన్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ కరుణాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేసి కళాశాలలను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని ఆయన కోరారు.
ఈ మేరకు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల నిర్వహణ భారంగా మారిందని, అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు చెల్లించడం, విద్యాసంస్థల రోజువారీ నిర్వహణ ఖర్చులను భరించడం యాజమాన్యాలకు సవాలుగా మారుతోందని పేర్కొన్నారు.
విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు వివరించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు కరుణాకర్ తెలిపారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కళాశాలల సమస్యను తన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు విజ్ఞాన్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ కరుణాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.







