రాష్ట్రం (ధర్మ రథం) ఆగస్టు 30
రాష్ట్రంలోని దళితవాడల్లో భూమి, ఇళ్ల స్థలాలు, శ్మశాన వాటికలు, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి వంటి కనీస అవసరాలు అందడం లేదని సామాజిక శంఖారావంకుల వివక్ష లేని సమాజం కోసం కార్యక్రమం ద్వారా చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. దశాబ్దాలు గడిచినా కుల వివక్ష, అంటరానితనం సమస్యలు కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది.
భారత రాజ్యాంగం సమానత్వం, గౌరవప్రదమైన జీవనం, సామాజిక న్యాయాన్ని హామీ ఇచ్చింది. అంటరానితనాన్ని నిషేధించింది. అయినప్పటికీ దశాబ్దాలు గడిచినా మన రాష్ట్రంలోని దళితవాడల్లో భూమి, ఇళ్ల స్థలాలు, శ్మశాన వాటికలు, తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం, ఉపాధి వంటి కనీస అవసరాలు అందని పరిస్థితి కొనసాగుతోంది. కుల వివక్ష, అంటరానితనం, సామాజిక బహిష్కరణ వంటి సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ నెల 24 నుండి చేపట్టిన సామాజిక శంఖారావంకుల వివక్ష లేని సమాజం కోసం కార్యక్రమం ఈ సమస్యలను మరింతగా వెలుగులోకి తెచ్చింది. 26 జిల్లాలు, 380 మండలాలు, 1,243 గ్రామాలు, 63 పట్టణాలు, 236 వార్డుల్లోని దళిత వాడల్లో పర్యటించగా, 960 శ్మశాన వాటిక సమస్యలు, 405 ఇళ్ల స్థలాల సమస్యలు, 302 భూ సమస్యలు మా బృందాల దృష్టికి వచ్చాయి. ఇవి కేవలం గణాంకాలు కావు. ప్రతి సంఖ్య వెనుక అనేక కుటుంబాలు, వారి జీవితాలు, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఉంది.
ప్రతి దళితవాడకు శ్మశాన వాటిక
అత్యధికంగా వెలుగులోకి వచ్చిన సమస్య శ్మశాన వాటికలకు సంబంధించింది. అనేక దళితవాడల్లో ప్రత్యేక శ్మశాన స్థలాలు లేవు. ఉన్న భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. కొన్ని చోట్ల శ్మశాన వాటికలకు రహదారులు కూడా లేవు. జీఓ 1235ను సమర్థవంతంగా అమలు చేసి ప్రతి దళితవాడకు ప్రత్యేక శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలి. అంతిమ కార్యక్రమానికి కూడా ఆందోళనలు చేయాల్సిన దుస్థితి అనేక జిల్లాల్లో నెలకొంది.
దళితుల భూములకు రక్షణ
దళిత కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు భూమి ప్రధాన ఆధారం. అయితే అసైన్డ్ భూముల ఆక్రమణ, పట్టాలు లేకపోవడం, రికార్డుల్లో భూములు నమోదు కాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. దళితుల భూములపై సమగ్ర సర్వే నిర్వహించి అర్హులకు పట్టాలు ఇవ్వాలి. ఆక్రమిత భూములను తిరిగి స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించాలి. భూమిలేని దళిత కుటుంబాలకు భూమి పంపిణీ చేయాలి. కోనేరు రంగారావు కమిషన్ సిఫారసులను అమలు చేయాలి. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ఇళ్ల స్థలం, ఇంటి పట్టా ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి తగిన ఆర్థిక సహాయం అందించాలి.
సబ్‌ప్లాన్ నిధులు పూర్తిగా ఖర్చు చేయాలి
ఎస్.సి జనాభా నిష్పత్తికి అనుగుణంగా సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులు చెయ్యాలి. పుస్తకాల్లో కేటాయింపులు వున్నా ఆచరణలో ఆ నిధులు దారి మళ్ళుతున్నాయి. సకాలంలో విడుదల చేసి పూర్తిగా ఖర్చు చేయాలి.
అధ్యయనంలో దేవాలయ ప్రవేశానికి నిరాకరణ, క్షవరం చేయకపోవడం, టీ దుకాణాలు - హోటళ్లలో వివక్ష, సామాజిక ప్రదేశాల్లో సమానంగా కూర్చోనివ్వకపోవడం, ఫంక్షన్లలో వేరుగా భోజనం పెట్టడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అంటరానితనం రాజ్యాంగ విరుద్ధమైనప్పటికీ ఇటువంటి ఘటనలు కొనసాగడం ఆందోళనకరం. కులవివక్ష, అంటరానితనం, సామాజిక బహిష్కరణ, దళితులపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితులకు రక్షణ, పరిహారం, న్యాయ సహాయం, న్యాయం అందించాలి. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులను అమలు చేయాలి.









