నార్కట్‌పల్లి, 2026-11-22
నార్కెట్ పల్లి పట్టణంలో పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి ఘటనపై భీమ్ ఆర్మీ, ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. దళిత మహిళ చందుపట్ల రమణపై దాడి చేసిన బాలకృష్ణ అనే వ్యక్తిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
నార్కెట్ పల్లి పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో ఎమ్, ఆర్, పి, ఎస్, మండల అధ్యక్షుడు లింగాల ముత్తయ్య మాదిగ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో 45వ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న దళిత మహిళ చందుపట్ల రమణ (45)పై దాడి చేసిన బాలకృష్ణ అనే వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఈరోజు భీమ్ ఆర్మీ ఎమ్, ఆర్, పి, ఎస్, ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు విధులు బంద్ చేసి స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి నాగరాజు మాట్లాడుతూ, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న చందుపట్ల రమణ చెత్త సేకరిస్తున్న సమయంలో ట్రాక్టర్‌పై నిలబడి చెత్తను అందుకునే క్రమంలో ఇసుకతో నిండిన బస్తాను పైకి ఎత్తలేకపోయిందని తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన బాలకృష్ణ అనే వ్యక్తి ఆమెను కులం పేరుతో, అసభ్య పదజాలంతో దూషిస్తూ, సెంట్రింగ్ కర్రతో కాళ్లపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టాడని తెలిపారు. పక్కనే ఉన్న ప్రజలు అడ్డుకున్నప్పటికీ వినకుండా తిరిగి దాడి చేసేందుకు ప్రయత్నించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
రోజువారీ కూలీ పనిపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న ఒక పేద దళిత మహిళపై ఇంతటి దాడికి పాల్పడటం అమానవీయమైన చర్య అని ఆయన అన్నారు. పారిశుద్ధ్య కార్మికులంటే చిన్నచూపు చూస్తూ, వారు ఏమీ చేయలేరనే అహంకారంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బాధితురాలిని ఉద్దేశించి అవమానకరమైన మాటలతో దూషించడంతో పాటు, నిందితుడి తల్లి కూడా దుర్భాషలాడినట్లు బాధితురాలు తెలిపారని ఆయన అన్నారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడితో పాటు దూషణలకు పాల్పడిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలికి తగిన న్యాయం చేయడంతో పాటు, ఆమెకు మెరుగైన వైద్యం, భద్రత కల్పించాలని ఆయన కోరారు. పారిశుద్ధ్య కార్మికులపై దాడులు పునరావృతం కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నిందితులను తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్, ఆర్, పి, ఎస్, పట్టణ అధ్యక్షుడు మంద సుధాకర్, బోడ నవీన్, బి.జె.పి, మండల అధ్యక్షుడు మెడబోయిన శ్రీనివాస్ యాదవ్, బి.జె.పి. కార్మిక విభాగం జిల్లా ఉప అధ్యక్షుడు జమండ్ల నవీన్ రెడ్డి, నోముల రాజు, పాలకూర రమేష్, శివ, సి.పి.యం, పట్టణ కార్యదర్శి అమానగంటి ఐలయ్య, కొప్పు శ్రవణ్, మంద గోపాల్, టి.డి.పి జిల్లా నాయకులు లింగాల యాదయ్య, మేజర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు వడ్డేగొని రామలింగం, మంద ఉమా, గిరి ప్రసాద్, బకరం జనార్దన్, జిల్లా మహేష్ మరియు గ్రామ పంచాయతీ కార్మికులు మేడి శ్రీను, షకీల్, మంది శంకర్, బోడ సందీప్, జయమ్మ, నర్సమ్మ, పద్మ, శంకరమ్మ, పార్వతమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.




