జగిత్యాల, 2026-11-27
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని గురువారం సాయంత్రం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి విద్యార్థినులు గమనించి ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది. తోటి విద్యార్థులు, అధ్యాపకుల వేధింపులే దీనికి కారణమని బాధితురాలు ఆరోపించింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని గురువారం సాయంత్రం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థినులు ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బాధితురాలు స్పందిస్తూ.. తోటి విద్యార్థులు, అధ్యాపకుల వేధింపులే తన ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆరోపించింది. తోటి విద్యార్థులు ర్యాగింగ్ తరహాలో వేధిస్తున్నారని ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఫిర్యాదు తర్వాత వేధింపులు మరింత పెరిగాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అసభ్య పదజాలంతో దూషిస్తూ మానసికంగా వేధించారని, పిచ్చి పట్టిందంటూ ఎగతాళి చేశారని తెలిపింది. ఘటన బయటకు రాకుండా ఆస్పత్రికి తరలించేలా యాజమాన్యం ఒత్తిడి చేసిందని బాధితురాలు ఆరోపించింది.
తోటి విద్యార్థుల ర్యాగింగ్, ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రిన్సిపల్‌ను సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది.



