కోడుమూరు, 2026-09-10
ఒకప్పుడు అన్నం పెట్టే చేతులు, నేడు కూలి పని కోసం కర్నూలు నగర వీధుల్లో ఆశగా ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది. పాలమూరు తీరుగా మారిన కర్నూలు జిల్లా రైతన్నల బతుకులు వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాలు, అప్పుల ఊబి కారణంగా దయనీయ స్థితికి చేరుకున్నాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సైతం రైతన్నల ఆశలపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలో ఎ.పి రైతుసంఘం నిర్వహించిన కరువు పర్యటనలో ఎన్నో కఠోర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఒకప్పుడు నలుగురికి అన్నం పెట్టే చేతులు, నేడు కూలి పని కోసం కర్నూలు నగర వీధుల్లో ఆశగా ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది. పాలమూరు తీరుగా మారిన కర్నూలు జిల్లా రైతన్నల బతుకులు ఈరోజు దయనీయ స్థితికి చేరుకున్నాయి. వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాలు, అప్పుల ఊబి అన్నీ కలిసి వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులతో పాటు కౌలురైతుల నడుము విరిచాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సైతం రైతన్నల ఆశలపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలో ఎ.పి రైతుసంఘం నిర్వహించిన కరువు పర్యటనలో ఎన్నో కఠోర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
రాయలసీమకు ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు తీవ్ర కరువును సృష్టిస్తున్నాయి. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు కురవక వేసిన పంటలు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 10,87,760 ఎకరాల సాగు భూమి ఉండగా, ఈ ఏడాది కేవలం 7,56,340 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో ఒక్క పత్తి పంట సుమారు 5,42,125 ఎకరాల్లో (మొత్తం సాగైన భూమిలో 75 శాతం) వేశారు. రైతులు ఎకరాకు రూ.50 వేలకు పైగా పెట్టుబడులు పెట్టారు. మొక్కకు 50 నుంచి 60 కాయలు ఉండాల్సింది, బతికిన కొద్దిపాటి మొక్కలకు కేవలం 2 నుంచి 3 కాయలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. మొక్కలు గిడసబారి పెరుగుదల లేకపోవడంతో పత్తి రైతులు అపార నష్టాలను చవిచూశారు.
ఉల్లి పంట పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జిల్లా వ్యాప్తంగా 7,960 ఎకరాల్లో ఉల్లి సాగైంది. కోడుమూరు మండలంలో ఈసారి 2,750 ఎకరాల్లో సాగు చేశారు. ఇందుకోసం ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు ఖర్చు చేశారు. సుమారు రూ.13.75 కోట్లు ఖర్చు చేశారు. కనీసం ఒక్క రూపాయి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. వేరుశనగ, మొక్కజొన్న, కొర్ర, మిరప, సజ్జ, ఆముదం, కంది తదితర పంటలన్నీ పూర్తిగా ఎండిపోయాయి. కొన్ని చోట్ల ఎండిన పంటలను గొర్రెల మేతకు వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది.
కోడుమూరు మండలంలోని ఒక్క వెంకటగిరి గ్రామంలోనే 1,600 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. మొత్తం పంట చేతికి రాని పరిస్థితి. ఇక్కడి రైతులు, కౌలు రైతులు ఇతర గ్రామాలకు పనులకు పోతున్నారు. ఇదే గ్రామానికి చెందిన రైతు గిడ్డయ్య ప్రతి ఏడాది ఏడెకరాలు కౌలుకు చేస్తారు. ఐదెకరాల దాకా సొంత భూమి ఉంది. ఈసారి కరువు తాండవించడంతో రెండెకరాలు కౌలుకు తీసుకుని రూ.లక్షలు ఖర్చు చేసి ఉల్లి సాగు చేశారు. పూర్తిగా ఎండిపోయింది. గతేడాది చేసిన దాదాపు రూ.4 లక్షల అప్పు ఉంది. ఈసారి రూ.లక్ష ప్రైవేట్ వడ్డీకి తెచ్చారు. అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితి నెలకొంది. కోడుమూరు ఆర్.టి.సి బస్టాండ్ హమాలీగా మూటలు మోయడానికి వెళ్తున్నారు. చంద్రన్న అనే రైతుకు ఎకరన్నర సొంత భూమి వుంది. ఇదిగాక ఐదెకరాలు కౌలుకు చేశారు. ఉల్లి సాగు చేయగా పూర్తిగా ఎండిపోయింది. పూట గడవక అడ్డా కూలీగా మారారు.












