Khammam/Madhira (ధర్మ రథం) నవంబర్ 22
భారతదేశంలో బంగారంలో కొత్త రకం కల్తీ బయటపడింది. చైనా నుంచి దిగుమతి అవుతున్న రహస్య రీనియం పౌడర్‌ను బంగారంలో కలిపి వ్యాపారులు వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఈ కల్తీని అత్యాధునిక హాల్‌మార్కింగ్ యంత్రాలు కూడా గుర్తించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
భారతదేశంలో అమ్ముతున్న బంగారంలో కొత్త రకం కల్తీ బయటపడింది. చైనా నుంచి దిగుమతి అవుతున్న రీనియం అనే రహస్య పౌడర్‌ను బంగారంలో కలిపి చాలా మంది వ్యాపారులు వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఈ రీనియం మెటల్ ద్వారా చేసే గోల్డ్ కల్తీని గుర్తించడంలో అత్యాధునిక హాల్‌మార్కింగ్ యంత్రాలు కూడా విఫలం కావడం వినియోగదారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రముఖ మీడియా సంస్థ చేపట్టిన ఒక స్టింగ్ ఆపరేషన్‌లో ఈ బంగారం కల్తీ గుట్టు బయటపడింది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక నగల వ్యాపారి సహకారంతో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సాధారణంగా బంగారంలో రాగి లేదా వెండిని కలిపితే హాల్‌మార్క్ యంత్రాలు వెంటనే వాటిని పసిగడతాయి. కానీ రీనియం పౌడర్‌ను కలిపితే అవి స్వచ్ఛమైన బంగారంగానే కనిపిస్తున్నాయి. దీనినే చాలా మంది వ్యాపారులు ప్రస్తుతం బంగారం ధరల పతనం సమయంలో విచ్చలవిడిగా వాడుతున్నారంట. దీంతో ధరలు తగ్గాయని ఆనందపడాలో లేక తాము కొంటున్న బంగారం నిజమైనదో, రీనియం కలిపిందో తెలియక చాలా మంది వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కల్తీ ప్రక్రియను పరిశీలించేందుకు 7.830 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారానికి ఒక గ్రాము రీనియం పౌడర్‌ను కలిపారు. దీనితో బంగారం బరువు 8.830 గ్రాములకు పెరిగింది. ఆ తర్వాత దీనిని ఒక హాల్‌మార్క్ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్షించగా, ఆ యంత్రం కల్తీ చేసిన బంగారాన్ని 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగానే ధృవీకరించింది. ఆ తర్వాత దీనికి మరో 0.75 గ్రాముల ఇతర లోహాలను కలిపి 22 క్యారెట్ల ఆభరణంగా మార్చారు స్టింగ్ ఆపరేషన్ చేపట్టిన మీడియా ప్రతినిధులు. దీనిని మళ్లీ పరీక్షించగా హాల్‌మార్క్ సెంటర్ దీనికి 916 సర్టిఫికేషన్ ఇచ్చింది. అంటే అది 91.6 శాతం స్వచ్ఛత కలిగిన 22 క్యారెట్ల బంగారమని ధృవీకరించింది. అంటే ఇక్కడ బంగారంలో కలిపిన రీనియం పౌడర్‌ను అస్సలు గుర్తించలేకపోయారు.
నిజానికి ఆ ఆభరణంలో అసలైన బంగారం ఉన్నది కేవలం 7.830 గ్రాములు మాత్రమే. ఈ లెక్కన చూస్తే అసలైన బంగారం స్వచ్ఛత 81.73 శాతం మాత్రమే. అంటే దీనిని సుమారు 20 క్యారెట్ల బంగారంగా పరిగణించాలి.
ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం చూస్తే, రీనియం కలిపిన ఒక తులం బంగారం కొన్న వినియోగదారుడు దాదాపు రూ.14,700 వరకు నష్టపోతారు.







