నర్సింహులపేట, 13 September
మండలం జయపురం గ్రామ శివారులోని ఆకేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ కట్ట, గతంలో భారీ వర్షాలకు కొట్టుకుపోగా, ఇటీవల చేపట్టిన తాత్కాలిక మరమ్మతులు నాసిరకంగా చేపట్టడంతో మళ్లీ దెబ్బతింది. రూ.5.88 లక్షల వ్యయంతో చేపట్టిన పనులు కొద్దిపాటి వర్షానికే కొట్టుకుపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*నాసిరకం మరమ్మతులు....* *మళ్లీ కొట్టుకుపోయిన చెక్‌డ్యామ్ కరాకట్ట* మండలం జయపురం గ్రామ శివారులోని ఆకేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ కరాకట్ట రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాల వరద తాకిడికి కొట్టుకుపోయింది. దెబ్బతిన్న కరాకట్టకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు టెండర్ ద్వారా రూ.5,88,461 కాంట్రాక్ట్ విలువతో పనులు చేపట్టినట్లు సమాచారం. అయితే, గుత్తేదారు నాసిరకంగా పనులు చేయడంతోనే తాజాగా కురిసిన సాధారణ వర్షానికే ఆకేరు వాగు ప్రవహించి, మరమ్మతులు చేసిన కరాకట్ట భాగం మళ్లీ కొట్టుకుపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే నాసిరకం పనులు జరిగాయని, ప్రజాధనం వృథా అయిందని ఆకేరు వాగు శివారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.5.88 లక్షలకు పైగా వెచ్చించిన పనులు కొద్దిపాటి వర్షానికే దెబ్బతినడంపై అధికారులు స్పందించి, పనుల నాణ్యతపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.












