మహబూబ్నగర్, 14 September
బహుభాషా కోవిదుడు, గొప్ప వక్త, సాహితీవేత్త, ప్రజా నాయకుడిగా బూర్గుల రామకృష్ణారావు అందించిన సేవలు చిరస్మరణీయమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
బూర్గుల రామకృష్ణారావు సేవలు చిరస్మరణీయం తెలంగాణ అభివృద్ధికి, విద్యా–రెవెన్యూ సంస్కరణలకు ఆయన కృషి మరువలేనిది: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్నగర్: బహుభాషా కోవిదుడు, గొప్ప వక్త, సాహితీవేత్త, ప్రజా నాయకుడిగా బూర్గుల రామకృష్ణారావు అందించిన సేవలు చిరస్మరణీయమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 1952లో జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ శాసనసభకు ఎన్నికైన బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు విశిష్టమైన సేవలు అందించారని కొనియాడారు. రెవెన్యూ, విద్యా రంగాల్లో ఆయన చేపట్టిన సంస్కరణలు ప్రజల జీవితాల్లో మార్పుకు బాటలు వేశాయని పేర్కొన్నారు. ఆచార్య వినోబాభావే చేపట్టిన భూదానోద్యమానికి బూర్గుల రామకృష్ణారావు అండగా నిలిచారని తెలిపారు. శివరాంపల్లి నుంచి పోచంపల్లి వరకు సాగిన శాంతియాత్ర, భూదానోద్యమం ద్వారా పేదలకు భూమి అందించాలనే ఆలోచనకు ఆయన మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. నాటి రెవెన్యూ మంత్రిగా ఈ ఉద్యమాన్ని సమర్థించడం ఆయనకు సామాజిక న్యాయం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరిపాలనా రంగంలో అనేక సంస్కరణలకు బూర్గుల రామకృష్ణారావు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఖమ్మం జిల్లా ఏర్పాటు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభానికి సంబంధించిన కీలక పరిణామాల్లో ఆయన పాత్ర ప్రత్యేకమైనదని గుర్తుచేశారు. విశాలాంధ్ర భావనకు మద్దతు పలికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడటం ఆయన రాజకీయ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ప్రజా జీవితంతో పాటు సాహిత్య రంగంలోనూ బూర్గుల రామకృష్ణారావు తనదైన ముద్ర వేశారని, బహుభాషల్లో పాండిత్యంతో పాటు రచనా ప్రతిభను చాటుకున్న మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. షాద్నగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికై హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన బూర్గుల రామకృష్ణారావు చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆయన ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, బ్రాహ్మణ సంఘం నాయకులు వావిలాల సుజీవన్, శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, సర్పంచ్ బాబు నాయక్, యువజన కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ ఖదీర్, భాస్కర్, శ్రీధర్ తదితరులు పాల్గొని బూర్గుల రామకృష్ణారావుకు ఘన నివాళులర్పించారు.











