నిర్మల్ రూరల్, 2024-03-06
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి వివరించారు. ముఖ్యంగా మహిళా సాధికారత, చేనేత కార్మికుల సంక్షేమం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మీ పథకం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం ఆవరణలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె పాల్గొన్నారు.
అనంతరం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై వివరించారు. 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విచ్చేసిన అందరికీ స్వాగతం పలికారు. స్వతంత్ర భారతావనిలో 60 ఏండ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని చెప్పడానికి సంతోషంగా ఉందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఈ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నదని, ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నానని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కింద జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేర్చడం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన పనుల ప్రణాళికలు రూపొందించడంలో ప్రజలను భాగస్వామ్యులు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో వ తేదీ నుండి వ తేదీ వరకు ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయబడిందని తెలిపారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీకి ఇప్పటిదాకా 390 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. మూలవాగుపై ఉన్న బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు 47 కోట్ల 86 లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి, నిత్యాన్నదాన సత్రం నిర్మాణ పనులు 111 కోట్ల 25 లక్షలతో చేపట్టగా వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 99 కోట్ల 40 లక్షల రూపాయలను అదనంగా మంజూరు చేసింది. 12 కోట్ల రూపాయలతో చేపట్టిన గుడి చెరువు బండ్ పార్కును ఇటీవలే ప్రారంభించుకోవడం జరిగింది. 40 అడుగుల ఆది శివుని విగ్రహం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతుంది. బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. గుడి చెరువులో బోటింగ్ కోసం 1 కోటి 40 లక్షల రూపాయలు మంజూరు కాగా, టెండర్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నాంపెల్లి గుట్టపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహకారంతో ఎయిర్ క్రాఫ్ట్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. రాజన్న ఆలయ గోశాల నిర్మాణానికి వేములవాడ రూరల్ మండలం మర్రిపెల్లిలో 40 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. భీమేశ్వర స్వామి ఆలయం 6 కోట్ల రూపాయలతో భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు చేయించడం జరిగింది.


