రంగారెడ్డి, 12 September
భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని జిల్లా కౌన్సిల్ సభ్యులు కంచుకోట మహేష్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కును కాలరాయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆయన అన్నారు.
ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య ఇచ్చిన 420 హామీలను ముందుగా అమలు చేయాలి: కంచుకోట మహేష్ కేశంపేట్: భారతీయ జనతా పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని జిల్లా కౌన్సిల్ సభ్యులు కంచుకోట మహేష్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు, ప్రజలకు ఉంటుందని అన్నారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మహేష్ ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలను ముందుగా అమలు చేసిన తర్వాతే కొత్త హామీల గురించి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, యువత, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగించిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. ప్రభుత్వం మారినా ప్రజల పరిస్థితుల్లో ఆశించిన మార్పు కనిపించడం లేదన్నారు. ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తీరుతామని కంచుకోట మహేష్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించి ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కును కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వ పనితీరును నిశితంగా గమనిస్తున్నారని, ఎవరు ఏం చేస్తున్నారు.. ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేస్తున్నారు అన్నది ప్రజలకు పూర్తిగా తెలుసని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని కంచుకోట మహేష్ తెలిపారు. ముందస్తు అరెస్టుల్లో సీనియర్ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి, యువ మోర్చా నాయకులు శివాజీ, రాకేష్, శివ, సందీప్, రాజు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.











