హైదరాబాద్, 2026-08-09
తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులకు స్థిరమైన ప్రవాహాలు అందడం లేదు. ఆగస్టు రెండో వారంలోకి ప్రవేశించినా ప్రధాన జలాశయాలు పూర్తిస్థాయిలో నిండాలంటే రాష్ట్రంలోనే కాకుండా ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ విస్తారంగా వర్షాలు కురవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, కృష్ణాగోదావరి నదులు పరవళ్లు తొక్కాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాగార్జునసాగర్‌లో ప్రత్యేకంగా వరుణ యాగం నిర్వహించనుంది.
తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులకు స్థిరమైన ప్రవాహాలు అందడం లేదు. ఆగస్టు రెండో వారంలోకి ప్రవేశించినా ప్రధాన జలాశయాలు పూర్తిస్థాయిలో నిండాలంటే రాష్ట్రంలోనే కాకుండా ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ విస్తారంగా వర్షాలు కురవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, కృష్ణాగోదావరి నదులు పరవళ్లు తొక్కాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాగార్జునసాగర్‌లో ప్రత్యేకంగా వరుణ యాగం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఈ యాగంలో పాల్గొననుండగా, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కార్యక్రమానికి నేతృత్వం వహించనున్నారు.
యాగ సంకల్పం
తెలంగాణతోపాటు కృష్ణా, గోదావరి ఎగువ పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా, సకాలంలో వర్షాలు కురవాలని, నదులకు స్థిరమైన ప్రవాహాలు రావాలని, జలాశయాలు, చెరువులు నిండాలని, భూగర్భ జలాలు పెరగాలని, వ్యవసాయానికి సమృద్ధిగా నీరు అందాలని కోరుతూ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన అర్చకులు, వేదపండితులు, ఆలయ సిద్ధాంతితో సంప్రదింపుల అనంతరం ఆగస్టు 10న వరుణ యాగం నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయించారు. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ ప్రాంగణంలో 11 హోమగుండాలను ఏర్పాటు చేస్తున్నారు. 108 మంది రుత్వికులు, అర్చకులు, వేదపండితులు రోజంతా ప్రత్యేక వైదిక క్రతువులు నిర్వహించనున్నారు.
వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్ష
వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, పంటలకు సాగునీటి కొరత తలెత్తకుండా కృష్ణా, గోదావరి నదులకు సమృద్ధిగా ప్రవాహాలు రావాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఎగువ రాష్ట్రాలపైనే ఆధారపడి ఉన్న జలభద్రత
తెలంగాణ జలభద్రత కేవలం రాష్ట్రంలో నమోదయ్యే వర్షపాతంపైనే ఆధారపడి ఉండదు. కృష్ణా, గోదావరి నదుల ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసే వర్షాలు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు అత్యంత కీలకం. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం సుమారు 2.59 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండగా, ఇందులో దాదాపు 44 శాతం కర్ణాటకలో, 27 శాతం మహారాష్ట్రలోనే ఉంది. అంటే కృష్ణా పరీవాహక ప్రాంతంలో 70 శాతానికిపైగా ఈ రెండు ఎగువ రాష్ట్రాల్లోనే ఉంది. కర్ణాటక, మహారాష్ట్రల్లోని పశ్చిమ కనుమలు, కృష్ణా, భీమా, తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో కురిసే వర్షాలే ఆల్మట్టి, నారాయణపూర్ మీదుగా జూరాలకు, అక్కడి నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వచ్చే ప్రవాహాలను ప్రధానంగా ప్రభావితం చేస్తాయి. గోదావరి విషయంలోనూ ఇదే పరిస్థితి. సుమారు 3.13 లక్షల చదరపు కిలోమీటర్ల గోదావరి బేసిన్లో దాదాపు 49 శాతం మహారాష్ట్రలోనే ఉంది. నాసిక్, మరాఠ్వాడాతోపాటు ఎగువ, మధ్య గోదావరి ప్రాంతాల్లో కురిసే వర్షాలు తెలంగాణలోని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టులకు వచ్చే ప్రవాహాలపై ప్రభావం చూపుతాయి. అందువల్ల రాష్ట్రంలో ఎంత వర్షం కురుస్తుందన్నదానితోపాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లో వర్షపాతం, ఎగువ జలాశయాల్లో నిల్వలు, అక్కడి నుంచి విడుదలయ్యే నీటిని నీటిపారుదల శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది.










