కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపిన యోగేశ్ గౌడ హత్య కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ రాజశేఖరప్ప కులకర్ణికి సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు హైకోర్టు ఇచ్చిన బెయిల్, శిక్ష నిలుపుదల ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో కులకర్ణితో పాటు మరో ఎనిమిది మంది దోషులు రెండు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుంది.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ష్రీ చంద్రశేఖర్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నారనే కారణంతో మాత్రమే నేర నిర్ధారణపై స్టే ఇవ్వడం సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. తీవ్రమైన తప్పిదం జరిగినట్లు ప్రాథమికంగా రుజువైనప్పుడు, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఉపశమనం కల్పించవచ్చని ధర్మాసనం పేర్కొంది.
2016 జూన్ 15న జిల్లా పంచాయతీ సభ్యుడైన యోగేశ్ గౌడ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో కుట్రదారుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో వినయ్ కులకర్ణితో పాటు పలువురికి ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది.
అయితే, కర్ణాటక హైకోర్టు ఈ దోషులకు బెయిల్ మంజూరు చేయడంతో పాటు, శిక్ష అమలును నిలిపివేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఉపశమన ఉత్తర్వులను సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం, సీబీఐ, మృతుడి సోదరుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ, దోషులు రెండు వారాల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. అయితే, అసలు నేర నిర్ధారణపై దాఖలైన అప్పీళ్లపై తుది విచారణ ఇంకా కొనసాగనుంది.





