మర్కుక్, 7 October
సిద్దిపేట జిల్లా మండలం ఎర్రవల్లి గ్రామంలో భూసర్వేలో తేడాలు వెలుగుచూశాయి. సర్వే నంబర్ 325 పరిధిలో రెవెన్యూ రికార్డులకు, క్షేత్రస్థాయి డిజిటల్ సర్వేకు మధ్య 45.5 ఎకరాల వ్యత్యాసంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ఆరా తీశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
సిద్దిపేట జిల్లా మండలం ఎర్రవల్లి గ్రామంలోని భూసర్వే నివేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించి, వివరాలను ఆరా తీశారు. సమీక్షలో భాగంగా సర్వే నంబర్ 325 పరిధిలోని రెవెన్యూ రికార్డులను మరియు క్షేత్రస్థాయి సర్వే వివరాలను అధికారులు సీఎంకు సమర్పించారు.
రికార్డులకు, క్షేత్రస్థాయికి తేడా
రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 325లో మొత్తం 388.5 ఎకరాలు నమోదై ఉంది. కానీ, అధికారులు ఇటీవల చేపట్టిన డిజిటల్ సర్వేలో కేవలం 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలింది.
45.5 ఎకరాల తేడా
రికార్డుల్లో నమోదైన విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి మధ్య 45.5 ఎకరాల తేడాపై సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా ఆరా తీశారు.
సరిహద్దుల పునఃపరిశీలన
ఈ 45.5 ఎకరాల భూమి తేడాకు కారణాలేంటి సరిహద్దుల గుర్తింపులో పొరపాట్లు జరిగాయా లేదా రికార్డుల్లో తప్పులున్నాయా అనే విషయాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
సర్వే నంబర్ 325 పరిసరాల్లో భూములున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పొరుగు రైతులకు భూమి రికార్డులను సమర్పించాలని నోటీసులు జారీ చేసేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
సర్వే నంబర్ 325లో స్పష్టత వచ్చిన భూమిలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం నివాస స్థలాలు కేటాయించి తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలని సీఎం సూచించారు.









