కోరుట్ల రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో సిబ్బంది అక్రమాలు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై అవినీతి నిరోధక బ్యూరో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఈ ఆకస్మిక తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో కార్యాలయ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, చలాన్లు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించగా పలు తీవ్రమైన అవకతవకలు బయటపడ్డాయి. నిబంధనల ప్రకారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలోనే జరగాల్సిన డ్రైవింగ్ టెస్టులు, వాహనాల రిజిస్ట్రేషన్ల తనిఖీలను ఏకంగా ఎస్. గిరీష్ కుమార్ అనే రవాణా కానిస్టేబుల్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లేనప్పటికీ కానిస్టేబుల్ ఈ ప్రక్రియను నడిపిస్తుండటం తీవ్ర ఉల్లంఘనగా ఏసీబీ తేల్చింది.
ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్ల ప్రాబల్యం మితిమీరిపోయినట్లు తనిఖీల్లో స్పష్టమైంది. సిబ్బంది ఏజెంట్లతో చేతులు కలిపి, సాధారణ ప్రజల నుండి పెద్ద ఎత్తున అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తేలింది. సాధారణ దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేస్తూ, ఏజెంట్లకు మాత్రం కార్యాలయంలోకి స్వేచ్ఛా ప్రవేశం కల్పిస్తున్నారని గుర్తించారు. పనులు పూర్తయ్యే వరకు ఏజెంట్లే సిబ్బందిలా వ్యవహరిస్తుండటం గమనార్హం. కార్యాలయంలో రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణ తగిన రీతిలో లేదని అధికారులు తెలిపారు. కింది స్థాయి ఉద్యోగుల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని వారు మండిపడ్డారు. అంతేకాకుండా, డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించే ట్రాక్ వద్ద ఎలాంటి ప్రాథమిక సూచిక బోర్డులు లేకపోవడాన్ని వారు తప్పుబట్టారు.
ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా తమకు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు.












