కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి. మధుసూదన్ రెడ్డి () స్పష్టం చేశారు. మూసాపేట్ మండలంలో జరిగిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులు, రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ అందజేశారు. ఉచిత వేరుశనగ విత్తనాల పంపిణీ కూడా జరిగింది.
మూసాపేట్ మండల రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసాపేట్ను మండలంగా ప్రకటించిందే తప్ప కాంప్లెక్స్ కూడా నిర్మించలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆర్బీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో 16 కోట్లు మంజూరు చేసిందని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు.
మూసాపేట్ మండలంలో 4 విద్యుత్ సబ్-స్టేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా, 133 సబ్-స్టేషన్కు శంకుస్థాపన చేశామని తెలిపారు. జానంపేట వద్ద ట్రామా కేర్ సెంటర్ పనులు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు.
సాగునీటి ప్రాజెక్టులు
కేఎలీఐ ఘనపూర్ బ్రాంచ్ కెనాల్ పరిధిలో 12 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశమున్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించగా పనులు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. చౌదర్పల్లి లిఫ్ట్ ద్వారా నందిపేట్, చక్రాపూర్, వేముల చెరువులకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు
గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు 6,500 కోట్ల వడ్డీ చెల్లిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 2 లక్షల రుణమాఫీ, 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్, 10 లక్షల ఆరోగ్యశ్రీ సేవలు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
రేషన్ కార్డు అనేది పేదల ఆత్మగౌరవమని, ఎలాంటి పైరవీలకు తావులేకుండా అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతిఏటా 13,000 కోట్లు వెచ్చించి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నట్లు వివరించారు.
ఇందిరమ్మ ఇండ్లు
దేవరకద్ర నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇండ్లు రాగా, అందులో మూసాపేట్ మండలానికి 360 ఇండ్లు కేటాయించామని తెలిపారు. రెండవ విడతలో గుడిసెల్లో నివసిస్తున్న 69 మందికి ఇండ్లు మంజూరు చేశామని, వచ్చే ఏడాది మార్చిలో మూడో విడత ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామని ప్రకటించారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే, ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందని, ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.











