లంచాల మత్తులో తేలియాడుతున్న అధికారులు, ప్రజాధనాన్ని స్వప్రయోజనాల కోసం మళ్లించే ప్రజాప్రతినిధులు, వారికి సలాం కొట్టే వ్యవస్థలు.. ఇవి నేడు సామాన్య పౌరుడు ఎదుర్కొంటున్న చేదు నిజాలు. ఒకప్పుడు భారతీయ పౌరుడిగా గర్వంగా చెప్పుకున్న సమాజంలో, నేడు ప్రతి అడుగునా అవినీతి రాక్షసుడు పడగ విప్పుతున్నాడు.
ప్రజలు కష్టపడి కట్టిన పన్నుల సొమ్ముతో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న కొందరు అధికారులు, కనీస సేవలందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు.
విద్య, వైద్యం.. అంతటా దందానే
సామాన్యుడు తన సంపాదనలో 90 శాతానికి పైగా ఖర్చు చేసే విద్య, వైద్య రంగాలను కూడా అవినీతి వ్యాపారంగా మార్చారు. ప్రజలకు ఉచితంగా లేదా అందుబాటు ధరల్లో అందాల్సిన కనీస అవసరాలు నేడు కోట్ల రూపాయల కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. సమస్యలపై ప్రశ్నించడానికి అధికారుల వద్దకు వెళ్తే, నిధులు లేవు, చూద్దాంలే అనే నిర్లక్ష్యపు సమాధానాలే ఎదురవుతున్నాయి.
జర్నలిజం ముసుగులో పెట్రేగుతున్న స్వార్థం
పాలకులు, అధికారులు అన్యాయం చేస్తే.. ప్రజలు చివరి ఆశగా ఆశ్రయించేది మీడియాను. కానీ, దురదృష్టవశాత్తు నేడు కొందరు జర్నలిజం ముసుగులో ఉన్న చిడపురుగులు బాధితుల సమస్యలను అధికారులకు తాకట్టు పెట్టి ముడుపులు దండుకుంటున్నారు. ప్రజల కష్టాలను పక్కదోవ పట్టించి, వ్యవస్థలోని లోపాలను కప్పిపుచ్చే వ్యాపారంగా జర్నలిజం రూపాంతరం చెందడం అత్యంత శోచనీయం.
నిజాయితీకి ప్రాణసంకటం
మరోవైపు, ప్రాణాలకు తెగించి నిజాన్ని నిర్భయంగా బయటపెట్టే నిజాయితీగల విలేకరులపై దాడులు చేయడం, తప్పుడు కేసులు బదిలీ చేయడం, చివరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడకపోవడం ప్రజాస్వామ్యానికే పెద్ద ముప్పుగా మారింది. నిజాన్ని రాసే కలాలకు సంకెళ్లు వేస్తూ, ప్రజలకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారు.
ఇది కేవలం ఒక వ్యక్తి ఆవేదన కాదు.. సమాజంలోని ప్రతి సామాన్యుడి ఆక్రోశం. ఈ అవినీతి వ్యవస్థను ప్రశ్నించే ధైర్యం ఉన్న యువత ముందుకు రావాలి. ముడుపులకు కక్కుర్తిపడి వార్తలు రాసేవారు దేశద్రోహులతో సమానం. నిజాన్ని నిర్భయంగా, నిష్పక్షపాతంగా రాయగలిగే దమ్ము, నైతిక విలువలు ఉన్నవారు మాత్రమే జర్నలిజంలోకి రావాలి.
జర్నలిజాన్ని కాపాడుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే. అవినీతి అంతం వైపు అడుగులు వేయడానికి, నిజాయితీగల జర్నలిస్టులకు మద్దతుగా ప్రజలంతా చేయి చేయి కలపాల్సిన సమయం ఆసన్నమైంది ప్రజలే సుప్రీం జై హింద్.. జై భారత్











