మెట్పల్లి, 24 July
మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావులపై షుగర్ ఫ్యాక్టరీ అంశంపై డాక్టర్ రఘు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు నిజమని నిరూపిస్తే సంజయ్ రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు.
మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న కావేరి గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ రఘు.. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావులపై షుగర్ ఫ్యాక్టరీ అంశంపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని వారు ఖండించారు.
షుగర్ ఫ్యాక్టరీ విషయంలో డాక్టర్ రఘు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ రఘును ఉద్దేశించి బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తూ, “ఎంబీబీఎస్ కోర్సు పూర్తి కావడానికి సాధారణంగా ఐదున్నర సంవత్సరాలు పడుతుంది. కానీ రఘు 12 సంవత్సరాలు చదివారని, వారికి చదువు పూర్తవ్వడానికి ఎంత సమయం పట్టిందో, రాజకీయాలు చేయడానికి కూడా అంతే సమయం పడుతున్నట్టుంది” అని ఎత్తిచూపారు.
ప్రజాసేవలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గత 20 సంవత్సరాలుగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నాయకులు కొనియాడారు. కరోనా మహమ్మారి సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించడం, కరోనా బాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారికి మనోధైర్యం కల్పించడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
అంతేకాకుండా, ఉచిత క్యాన్సర్ ఆరోగ్య శిబిరాలు, వివిధ వైద్య శిబిరాలు నిర్వహించి వేలాది మంది ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు, నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాలను నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారు.
ప్రజాసేవ అంటే మాటలు కాదని, చేతలని నిరూపిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి గ్రంథాలయంలో ప్రతిరోజూ చదువుకునేందుకు వచ్చే విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. విద్యార్థులు ఆకలితో చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ సేవను నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై ఎవరికైనా సందేహం ఉంటే మెట్పల్లి గ్రంథాలయానికి వెళ్లి స్వయంగా చూసి నిజానిజాలు తెలుసుకోవాలని సవాల్ విసిరారు.
అలాగే, ఎమ్మెల్యే సంజయ్ టీ-హబ్, టీ-వర్క్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు విద్యార్థులను తీసుకెళ్లి ఆధునిక సాంకేతికత, స్టార్టప్‌లపై అవగాహన కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని వెల్లడించారు.
ఇలాంటి నిరంతర ప్రజాసేవలను విస్మరించి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకోవాలని, ప్రజలు అన్ని వాస్తవాలను గమనించి అభివృద్ధి, సేవలను చూసి సరైన తీర్పు ఇస్తారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.








