కొల్హాపూర్, 19 అక్టోబర్ 2024
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం గోకుల్ డెయిరీ చైర్మన్ ఎన్నిక వివాదం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నిబంధనలు మార్చి రైతుల ప్రజాస్వామ్య తీర్పును ప్రభావితం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన పోస్టును పంచుకుంటూ, గోకుల్ ఎన్నికల్లో పాల ఉత్పత్తిదారులు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నలుగురు నామినేటెడ్ డైరెక్టర్లకు ఓటు హక్కు కల్పించేలా నిబంధనలు మార్చాలని చూస్తోందని ఆరోపించారు. ఇది రైతుల ఓట్లను దొంగిలించడమేనని, ప్రజా తీర్పును వక్రీకరించడమేనని వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ప్యానెల్‌కు 13 స్థానాలు
కొల్హాపూర్ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం గోకుల్ డెయిరీ బోర్డులో మొత్తం 25 డైరెక్టర్ స్థానాలున్నాయి. జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ సతేజ్ పాటిల్ నేతృత్వంలోని రాజర్షి షాహు శేత్కరి సమవిచారి ఆఘాడీ 13 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మద్దతు ప్యానెల్ 12 స్థానాలు సాధించింది.
దీంతో సతేజ్ పాటిల్ వర్గానికి బోర్డులో ఒక స్థానం ఆధిక్యం లభించింది. అయితే చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు మొత్తం 14 మంది డైరెక్టర్లు హాజరు కావాల్సి ఉంది. జరిగిన సమావేశానికి మహాయుతి మద్దతు ఉన్న 12 మంది డైరెక్టర్లు గైర్హాజరు కావడంతో కోరం పూర్తికాలేదు, సమావేశం వాయిదా పడింది.
ఆ తర్వాత సతేజ్ పాటిల్ వర్గానికి చెందిన 13 మంది డైరెక్టర్లు విడిగా సమావేశమై శశికాంత్ పాటిల్ చుయేకర్ను చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ ఎన్నికను డెయిరీ పరిపాలన గుర్తించలేదు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి
ఈ వివాదం కొనసాగుతుండగానే న మహారాష్ట్ర మంత్రివర్గం సహకార సంఘాల చట్టంలో సవరణకు ఆమోదం తెలిపింది. ఏడాదికి రూ.500 కోట్లకు పైగా టర్నోవర్ కలిగి, ప్రభుత్వ సహాయం పొందుతున్న కొన్ని పెద్ద సహకార సంస్థల బోర్డుల్లో ఐదుగురు ప్రభుత్వ నామినేటెడ్ సభ్యులను నియమించే అవకాశం కల్పించనుంది. వీరిలో నలుగురికి బోర్డు సమావేశాల్లో ఓటు హక్కు ఉంటుంది. ఐదో సభ్యుడిగా నియమించే సహకార శాఖ అధికారి ఓటు వేయలేరు. ఈ నామినేటెడ్ సభ్యులు చైర్మన్ వంటి పదవులకు పోటీ చేయడానికి అర్హులు కారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు ఈ సవరణ వర్తించదు.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే గోకుల్ డెయిరీ బోర్డులో ఓటింగ్ సమీకరణ మారే అవకాశం ఉందని ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాలుగు ఓటింగ్ హక్కులున్న నామినేటెడ్ సభ్యులు చేరితే మహాయుతి మద్దతు వర్గానికి 16 ఓట్లు, సతేజ్ పాటిల్ వర్గానికి 13 ఓట్లు ఉండే పరిస్థితి ఏర్పడవచ్చని రాజకీయ విశ్లేషణలు పేర్కొంటున్నాయి.
ప్రభుత్వం చెబుతున్న కారణం ఇదీ
పెద్ద టర్నోవర్ ఉన్న సహకార సంస్థల్లో ప్రభుత్వ నిధులు, ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని, వాటి నిర్వహణలో నిపుణుల భాగస్వామ్యం, పారదర్శకత, సమర్థవంతమైన పాలన అవసరమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బోర్డుల్లో ప్రతిష్ఠంభన ఏర్పడినప్పుడు దాన్ని పరిష్కరించేందుకు ఈ మార్పు ఉపయోగపడుతుందని సహకార శాఖ అధికారి వివరించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.











