జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పాల్గొని, జిల్లా కలెక్టర్‌ను కలిసి పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ముఖ్యంగా కోరుట్ల పట్టణంలోని గడి బురుజు భూమికి విధించిన వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ను తక్షణమే రద్దు చేయాలని, అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఆయన కోరారు.
గడి బురుజు భూమిపై వీఎల్టీ రద్దు చేయాలి
కోరుట్ల పట్టణానికి చారిత్రక, ప్రజా ప్రాధాన్యం కలిగిన గడి బురుజు భూమిని ప్రజా ప్రయోజనాల కోసం పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే డా. సంజయ్ తెలిపారు. ఈ భూమిపై విధించిన వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌ను వెంటనే రద్దు చేయాలని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ నిర్వహించి, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్‌ను కోరారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
మరోవైపు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మరో వినతిపత్రాన్ని సమర్పించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యాసంస్థలు ఫీజుల చెల్లింపుపై ఒత్తిడి తెస్తూ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా
విద్యార్థుల విద్యాభవిష్యత్తు దెబ్బతినకుండా ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు, విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన జిల్లా కలెక్టర్‌ను కోరారు.











