వరంగల్, 2024-05-15
కాజీపేట ఫాతిమా ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కాజీపేట 62వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, అవాస్తవ ప్రచారాలను సహించబోమని ఆయన అన్నారు.
వరంగల్: కాజీపేట ఫాతిమా ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కాజీపేట 62వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఫాతిమా నూతన ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వస్తున్న అవాస్తవ ప్రచారాలను ఖండిస్తున్నామని తెలిపారు.
ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఎమ్మెల్యే ప్రత్యేక రివ్యూ సమావేశాలు నిర్వహించి, అధికారులతో చర్చించి, నిధులు మంజూరు చేయించారని, ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కృషి వల్లే ఈ బ్రిడ్జి నిర్మాణం సాధ్యమైందని పేర్కొన్నారు.
కాజీపేట ప్రజల కోసం నిజంగా పని చేయాలనుకుంటే, కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించేలా, కాజీపేటను రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేసే విధంగా బీజేపీ తమ రాష్ట్ర ఎంపీలతో చర్చించి, కాజీపేట అభివృద్ధిపై కృషి చేయాలని రావు పద్మను యాదవ్ ప్రశ్నించారు. పాత బ్రిడ్జి మరమ్మతులకు రూ. 50 లక్షలు, నూతన బ్రిడ్జి, పాత బిల్లుల చెల్లింపునకు రూ. 16 కోట్లు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు.
మిగిలిన పనులు రానున్న రోజుల్లో అతి వేగంగా పూర్తవుతాయని, నిరంతరం ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై అవాస్తవ ఆరోపణలు చేస్తే సహించేది లేదని యాదవ్ హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా కనిపించని అభివృద్ధి నేడు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందని, కాజీపేటలోని ప్రతి డివిజన్, ప్రతి గల్లీలో సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
కేవలం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలోనే కాజీపేట అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ ఆరూరి సాంబయ్య, మాజీ కార్పొరేటర్ సుంచు అశోక్, హనుమకొండ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎం.డి అంకుష్, పాలడుగుల ఆంజనేయులు, 47వ డివిజన్ అధ్యక్షులు షేక్ అజ్గర్, భైరబోయిన రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుంచు సుధాకర్, మంతుర్తి బొంద్యాలు, శివరాం, తాడూరి ప్రశాంత్, జక్కుల నవీన్, గాలి శీను, పూర్ణచందర్, విజయ్, సెలవెరి శీను, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.








