జిల్లా ప్రజలందరూ దసరా పండుగను సంతోషంగా, ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ గారు సూచించారు. పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని ఆయన తెలిపారు.
పండుగ వేళ ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని, ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. బెట్టింగ్లు, జూదం, గొడవలు, తగాదాలకు దూరంగా ఉండాలని, పండుగలను సంప్రదాయబద్ధంగా, సోదరభావంతో జరుపుకోవాలని ఆయన కోరారు.
దసరా సెలవుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణించే వారు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఆయన తెలిపారు. ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేసి వెళ్లేవారు విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఇంటి భద్రత కోసం సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆయన సూచించారు.
పండుగ కోసం స్వగ్రామాలకు వచ్చే యువత గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని, ఎలాంటి గొడవలకు తావివ్వకూడదని ఆయన సూచించారు. దసరా సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, ప్రమాదకర ప్రాంతాల్లో ఆడుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించి దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన కోరారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: డయల్ 112 జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్: 8712686026, 8712686057 లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించవచ్చు.












