వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను అమలు చేసి రైతాంగ సమస్యలను పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాయికల్ తహశీల్దార్ కార్యాలయం ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు.
అర్హులైన రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతుభరోసా బకాయిలు చెల్లించాలని, అన్ని పంటలకు మద్దతు ధరపై రూ. 500 బోనస్ ఇవ్వాలని కోరారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతుబీమా, పంటల బీమా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోడు, అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరించాలని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి కమతానికి నీరందించాలని కోరారు. మూతపడిన చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించి, చెరకు ధర టన్నుకు రూ. 5 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, కొనుగోలు కేంద్రాలను ముందుగానే ప్రారంభించాలని, మార్కెట్ యార్డుల్లో అక్రమ వసూళ్లను అరికట్టాలని కోరారు. పంట నష్టపరిహారం, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి హామీలను అమలు చేయకపోతే రైతుల హక్కుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీకేఎస్ మండల అధ్యక్షుడు బి. శైలేందర్రెడ్డి, జోనల్ అధ్యక్షుడు రావుల లింగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుమల శంకర్, రవికుమార్ పాల్గొన్నారు.












