కోరుట్ల, 26 July
కోరుట్ల పట్టణంలో దళిత మహిళ కర్రె సునీత దారుణ హత్య నేపథ్యంలో, విధుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఎస్సై చిరంజీవిని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ సస్పెండ్ చేశారు. గతంలో జరిగిన దాడిపై పోలీసులు స్పందించకపోవడం, ఆ తర్వాత జరిగిన హత్యపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
కోరుట్ల పట్టణంలో చోటుచేసుకున్న దళిత మహిళ కర్రె సునీత హత్యోదంతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకసారి మహిళపై దాడి జరిగినా పోలీసులు స్పందించకపోవడం, మరో వారం రోజుల వ్యవధిలోనే అదే మహిళ దారుణ హత్యకు గురికావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో విధుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన కోరుట్ల ఎస్సై చిరంజీవిని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
కోరుట్ల పట్టణానికి చెందిన కాసుల గంగారెడ్డితో కొంతకాలంగా కర్రె సునీత సహజీవనం చేస్తోంది. ఈ వ్యవహారం గంగారెడ్డి కుమారుడు కాసుల వంశీకి నచ్చలేదు. దీంతో జూన్ 19న కోరుట్లలోని రాంనగర్ ఏరియాలో నివాసముంటున్న కర్రె సునీత ఇంటికి వెళ్లిన కాసుల వంశీ కర్రలతో దాడి చేశాడు. ఈ దాడిలో సునీత చేయి విరగడంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అనంతరం సునీత తల్లి కోరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై చిరంజీవి ఇరువర్గాలను పిలిపించి మాట్లాడారు. కాసుల గంగారెడ్డి తనతో సహజీవనం చేస్తున్న సునీతతో రాజీ కుదుర్చుకోవడంతో పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేయలేదు.
ఆ తర్వాత సునీతను గంగారెడ్డి మెట్‌పల్లికి మార్చగా.. దాడి జరిగిన 22 రోజులకు (ఈనెల 12న) వంశీ మెట్‌పల్లికి వెళ్లి కత్తితో కర్రె సునీతను దారుణంగా హతమార్చాడు. మొదటి దాడి జరిగిన సమయంలోనే నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేసి ఉంటే ఈ హత్య జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో దళిత మహిళ దారుణ హత్యకు గురికావడాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం మెట్పల్లి మండలం చింతలపేటలోని కర్రె సునీత ఇంటికి వెళ్లిన మంత్రి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలో దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మొదట దాడి జరిగినప్పుడే పోలీసులు స్పందించి కేసులు నమోదు చేసి ఉంటే నిందితుడు బరితెగించి హత్య చేసేవాడు కాదని ఆరోపించారు. ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తక్షణ చర్యలకు ఆదేశించారు. ఈ క్రమంలోనే ఎస్సై చిరంజీవిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ అశోక్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్సై చిరంజీవి వ్యవహారశైలిపై గతంలోనూ విమర్శలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఒక అడ్వకేట్ కేసు నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు వెళితే ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన ఉంది. అలాగే, గతంలో బక్రీద్ సందర్భంగా భజరంగ దళ్, హిందూ వాహిని కార్యకర్తలపైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన వ్యవహారంలోనూ ఎస్సై తీరుపై విమర్శలు వచ్చాయి. దీనిపై భజరంగ దళ్ కార్యకర్తలు (ఎన్హెచ్ఆర్సీ)ని సంప్రదించినట్లు కూడా స్థానికంగా చర్చ నడిచింది.
ప్రస్తుతం ఎస్సై సస్పెన్షన్ వెనుక అసలు కారణాలు, శాఖాపరమైన విచారణలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారనేదానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పూర్తి వివరాలు వెలువడిన తర్వాత ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.











