మండలంలోని గ్రామాలలో మద్యం సేవించిన తర్వాత రోడ్లు, పంట పొలాలు, గట్ల వెంట ఖాళీ మద్యం సీసాలను విచ్చలవిడిగా పడేస్తుండటంతో ప్రజలకు, ముఖ్యంగా రైతులు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. బాధ్యతారాహిత్యంగా సీసాలను పడేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని గ్రామాలలో మద్యం సేవించిన తర్వాత రోడ్లపై, పంట పొలాల్లో, పొలాల గట్ల వెంట ఖాళీ మద్యం సీసాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తుండటంతో ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. మద్యం తాగిన అనంతరం ఖాళీ సీసాలను సురక్షితంగా పారవేయాల్సిన బాధ్యతను విస్మరిస్తున్న కొందరు మందుబాబులు, నిర్మానుష్య ప్రదేశాలు, రహదారుల పక్కన, వ్యవసాయ భూముల్లో సీసాలను పడేసి వెళ్తున్నారు.
దీంతో రాత్రివేళల్లో, తెల్లవారుజామున పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. పగిలిన సీసాల పెంకులు కాళ్లకు గుచ్చుకుంటే రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాల టైర్లకు సీసాల పెంకులు గుచ్చుకోవడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది.
రైతులకు అదనపు ఇబ్బంది
ఇప్పటికే వ్యవసాయ పనుల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఇలాంటి నిర్లక్ష్యం మరింత ఇబ్బందికరంగా మారుతోంది. మద్యం కొనడానికి డబ్బులుంటాయి కానీ, ఖాళీ సీసాలను బాధ్యతగా పారవేయడానికి మనసు రాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మద్యం సేవించడం వ్యక్తిగత విషయమైనప్పటికీ, తాగిన సీసాలను ప్రజలు తిరిగే రోడ్లపై, ఇతరుల జీవనాధారమైన పంట పొలాల్లో పడేయడం మాత్రం బాధ్యతారాహిత్యమేనని పేర్కొంటున్నారు. తాము పడేసిన సీసా పెంకులే తమ కుటుంబ సభ్యులకు గుచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు.
సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి
ఖాళీ సీసాలను నిర్ణీత చెత్త సేకరణ ప్రదేశాల్లో లేదా వాటిని స్వీకరించే కేంద్రాల్లో సురక్షితంగా అప్పగించాలని, రహదారులు, పంట పొలాల పరిశుభ్రతకు సహకరించాలని కోరుతున్నారు. మద్యం సీసా ఖాళీ కావచ్చు, కానీ మనిషిగా మన బాధ్యత ఖాళీ కాకూడదు.
ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని ప్రజలు కోరారు.












