ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో ప్రజలందరికీ ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడమే తమ మొదటి ఎజెండా అని గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ - శ్రీనివాస్ తెలిపారు. అందుకోసం ప్రతీ శుక్రవారం ఫ్రైడే - డ్రై డే గా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. వర్షాకాలంలో వాతావరణ మార్పుల వలన, దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ, పాత నీటిని ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి పారబోసి, కొత్త నీటిని నింపుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లో, ఇంటి పరిసరాల్లో ఉన్న నీటి తొట్టెలు, కూలర్లు, పూల కుండీలు, డ్రమ్ములు మరియు పాత టెర్రస్‌లపై పేరుకుపోయిన నీటిని ప్రతి శుక్రవారం రోజున పూర్తిగా ఖాళీ చేసి ఆరబెట్టాలని తెలిపారు. ఉపయోగించని టైర్లు, కొబ్బరి బొండాలు, ఖాళీ సీసాలలో నీరు చేరకుండా జాగ్రత్త వహించాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని సూచించారు.
పరిశుభ్రతపై దృష్టి
పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, తాగునీటి పాత్రలపై మరియు నీటి తొట్టెలపై తప్పనిసరిగా మూతలు ఉంచాలని సూచించారు. మన ఆరోగ్యం - మన చేతుల్లోనే ఉంది అనే విషయాన్ని గుర్తించి, గ్రామ పంచాయతీ చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించి, ప్రతీ శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ అఫీజా, రేఖ, ఆశా వర్కర్లు కల్పన, మాధవి, లావణ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












