సిద్దిపేట, 15 November
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ ఆసుపత్రిలో (1000 పడకల ఆసుపత్రి) రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కల్పించాల్సిన కనీస సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, రోగులకు అందించే పౌష్టికాహారం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. తాగునీటి ఎద్దడి: ఆసుపత్రిలో రోజుకు 800-1000 మంది అవుట్ పేషెంట్లు, 300 మందికి పైగా ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. అయితే ఆసుపత్రిలోని వాటర్ ప్లాంట్లు మూతపడ్డాయి. కుళాయిల్లో నీరు రావడం లేదు. తాగునీటి కోసం రోగులు బయట ప్రైవేటుగా నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. మరుగుదొడ్లలో నీరు లేకపోవడంతో తీవ్ర దుర్వాసన, ఇన్ఫెక్షన్ల భయం నెలకొంది. ముఖ్యంగా ప్రసూతి, మహిళా వార్డుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
భోజనంలో ప్రభుత్వ మెనూ ఉల్లంఘన: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇన్ పేషెంట్లకు ఉదయం 200 పాలు, బ్రెడ్, మధ్యాహ్నం, రాత్రి పప్పు, సాంబార్, ఆకుకూర, పెరుగు, కోడిగుడ్డుతో కూడిన పూర్తి భోజనం అందించాలి. కానీ ఆసుపత్రిలో నామమాత్రంగా పల్చటి పప్పునీళ్లు, అన్నం మాత్రమే పెడుతున్నారు. ఉదయం ఇచ్చే పాలలో నీళ్లు కలుపుతున్నారని, బ్రెడ్ పూర్తిగా ఇవ్వడం లేదని రోగులు వాపోతున్నారు. రికార్డుల్లో మాత్రం పూర్తి మెనూ అందించినట్లు చూపి నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆకస్మిక తనిఖీలోనే వైద్యుల నిర్లక్ష్యం, మందుల కొరత బయటపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు నీరు, ఆహారం విషయంలో కూడా అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది.
కావున జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించి, తక్షణమే ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా, ప్లాంట్ల మరమ్మత్తు చేయించాలని కోరుతున్నారు. రోగుల భోజనం, పాలు, బ్రెడ్ సరఫరాలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపి, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ డైట్ మెనూ పట్టికను ప్రతి వార్డులో ప్రదర్శించి, ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని రోగులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఇన్ పేషెంట్ కు ఇవ్వాల్సిన డైట్ మెనూ ఇది: ప్రభుత్వ మెనూ ప్రకారం: ఉదయం 6 గంటలకు: 200 ML పాలు 4 బ్రెడ్ స్లైసులు / రాగి జావ ఉడికించిన గుడ్డు. మధ్యాహ్నం 12:30 కి: అన్నం పప్పు / సాంబార్ కూర పెరుగు గుడ్డు. రాత్రి 7:30 కి: అన్నం / చపాతీ కూర పప్పు పాలు. కానీ ఆసుపత్రిలో జరుగుతున్నది ఏంటి రోగులు, వారి బంధువులు చెబుతున్న దాని ప్రకారం: పాలు మాయం: ఉదయం ఇవ్వాల్సిన పాలు నీళ్లు కలిపినట్లు పలుచగా ఉంటున్నాయి. చాలా మందికి అసలు ఇవ్వడమే లేదు. పాలు అయిపోయాయి అని చెబుతున్నారట. బ్రెడ్ - గుడ్డు గల్లంతు: బ్రెడ్ లో 2 ముక్కలు మాత్రమే ఇస్తున్నారు. గుడ్డు అయితే వారంలో 2 రోజులు మాత్రమే ఇస్తున్నారు. మిగతా రోజులు లెక్కల్లో మాత్రమే ఉంటోంది. మధ్యాహ్నం, రాత్రి భోజనం: మెనూ బోర్డు మీద కోడిగుడ్డు, పెరుగు, పప్పు అని రాసి ఉంటుంది కానీ, ప్లేటులో మాత్రం ఉప్పు లేని పుల్లటి సాంబారు, నీళ్ల అన్నం మాత్రమే ఉంటోంది. కూర అంటే కేవలం ఆలుగడ్డ ముక్కలు. నాణ్యత దారుణం: అన్నం ఉడకడం లేదు అని పలువురు రోగులు వాపోతున్నారు. దీంతో చాలా మంది బయట హోటల్ నుంచి తెప్పించుకుంటున్నారు, లేదా పస్తులు ఉంటున్నారు. ప్రభుత్వం మా కోసం మంచి భోజనం పెడుతుంది అనుకున్నాం. కానీ ఇక్కడ ఇచ్చేది తినలేకపోతున్నాం. అడిగితే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు అని వార్డులో ఉన్న ఓ వృద్ధ రోగి ఆవేదన వ్యక్తం చేశారు.






