జగిత్యాల, 21 September
జగిత్యాల పట్టణంలోని 49వ వార్డులో పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో 75 సంవత్సరాలుగా గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణలో గణపతి ఉత్సవాలకు జగిత్యాలే తొలి వేదిక అని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ తెలిపారు.
జగిత్యాల పట్టణంలోని 49వ వార్డులో పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో పద్మశాలి గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు 75 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆమె గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ, 49వ వార్డులోని పద్మశాలి కుటుంబాలు కలిసి గత 75 సంవత్సరాలుగా మూడు తరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారని తెలిపారు. తరతరాలుగా పద్మశాలి సమాజం ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు.
ఉత్తర తెలంగాణలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు జగిత్యాలలోనే తొలిసారిగా శ్రీకారం చుట్టిన ఘనత ఉందని ఆమె అన్నారు. పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఉత్సవాలను నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.
75 ఏళ్లుగా మూడు తరాలుగా కొనసాగుతున్న పద్మశాలి గణనాథుడి ఉత్సవాలు జగిత్యాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తున్నాయని జ్యోతి లక్ష్మణ్ పేర్కొన్నారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పిప్పరి అనిత శ్రీనివాస్, మాజీ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు గంగాధర్, కార్యవర్గ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












