రాజన్న సిరిసిల్ల, 2026-07-31
సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) చంద్రయ్య ఉద్యోగ విరమణ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు, సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ముఖ్య అతిథిగా హాజరై, చంద్రయ్య గారిని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖలో చంద్రయ్య గారి సుదీర్ఘ సేవలను ఎస్పీ కొనియాడారు.
ఉద్యోగ విరమణ పొందుతున్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) చంద్రయ్య గారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు, సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ముఖ్య అతిథిగా హాజరై అదనపు ఎస్పీ చంద్రయ్య గారిని ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో అదనపు ఎస్పీ చంద్రయ్య ఎన్నో సంవత్సరాల పాటు అంకితభావంతో, నిజాయితీతో, క్రమశిక్షణతో సేవలందించారని కొనియాడారు. తన విధి నిర్వహణలో సమర్థత, బాధ్యతాయుతమైన వ్యవహారశైలి, సహోద్యోగులతో సత్సంబంధాలు కలిగి శాఖకు మంచి గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ అనేది సేవా జీవితానికి ముగింపు మాత్రమేనని, సమాజ సేవకు కాదని, పదవీ విరమణ అనంతరం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
సహచర అధికారులు, పోలీస్ సిబ్బంది చంద్రయ్య గారితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన సేవలను ప్రశంసించారు. అనంతరం పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించి ఘనంగా వీడ్కోలు పలికారు.
అదనపు ఎస్పీ చంద్రయ్య 1991 సంవత్సరంలో ఎస్.ఐ గా పోలీస్ శాఖలో చేరి, శిక్షణ అనంతరం తొలిసారిగా కొత్తగూడ పోలీస్ స్టేషన్, వరంగల్ లో బాధ్యతలు చేపట్టారు. వరంగల్ లో పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. 2007లో ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశారు. 2017లో డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించి, రామగుండం కమిషనరేట్ లో క్రైమ్ ఏ.సి.పి గా, హన్మకొండ, సైబరాబాద్ లలో ఏసీపీ క్యాడర్ లో ముఖ్య బాధ్యతలు అందించారు. కరీంనగర్ పోలీస్ ట్రేనింగ్ కళాశాలలో పనిచేసే సమయంలో 2021లో అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది, రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి, నాలుగున్నర సంవత్సరాలుగా జిల్లాలో విశిష్ట సేవలు అందించి నేడు గౌరవప్రదంగా ఉద్యోగ విరమణ పొందారు.
రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను సేవ పథకం, ఉత్తమ సేవ పథకాలతో సత్కరించింది. 35 సంవత్సరాల సుదీర్ఘ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ మెడల్ తో సత్కరించింది.
ఈ కార్యక్రమంలో డిఎస్పీలు, సి.ఐలు, ఆర్.ఐలు, ఎస్.ఐలు, ఏ.ఓ, కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










