ఖమ్మం నగరంలో ప్రేమ పేరుతో వేధింపులకు గురైన ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మృతిచెందిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నగరానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్ బాలురు వేధిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారి వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఈ నెల 8వ తేదీన ఇంట్లో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. బాలికను వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే, ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం బాలిక తుదిశ్వాస విడిచింది. మృతిచెందిన బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖమ్మం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మైనర్ బాలుర వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.











