వంగవీడు గ్రామంలోని అయ్యప్ప సత్రంలో పాఠశాల విద్యార్థులు భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి బుద్ధి వినాయక విగ్రహ నిమజ్జన మహోత్సవం బుధవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. సాయంత్రం 4:00 గంటలకు అయ్యప్ప సత్రం నుండి ప్రారంభమైన గణనాథుని ఊరేగింపు వినూత్న రీతిలో పల్లకిలో సాగింది.
గ్రామంలోని గంగనమ్మ సెంటర్ మీదుగా స్థానిక చెరువు వరకు ఈ శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. ఊరేగింపులో చిన్నారులు, మహిళలు చేసిన కోలాటాలు, సాంస్కృతిక నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంగళవాయిద్యాలు, భజన కీర్తనలు, గణపతి బప్పా మోరియా నామస్మరణలతో వంగవీడు వీధులు మారుమోగాయి.
అనంతరం వంగవీడు చెరువులో గణనాథుడిని నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమంలో వంగవీడు గ్రామ ప్రజలు, యువజన సంఘం సభ్యులు, అయ్యప్ప సత్రం కమిటీ నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు.












