రాజన్న జిల్లాలో అర్హులైన వృద్ధులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద జిల్లాకు మంజూరైన పరికరాలను ఆమె పరిశీలించారు.
రాజన్న జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అర్హులైన వృద్ధులకు అవసరమైన ఉపకరణాలను పరిశీలించి, పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, రాష్ట్రీయ వయోశ్రీ యోజన ద్వారా జిల్లాలోని 3521 మంది సీనియర్ సిటిజెన్లకు, రెండు కోట్ల 90 లక్షల రూపాయల వ్యయంతో 16,631 సహాయ పరికరాలు జిల్లాకు మంజూరయ్యాయని వెల్లడించారు. వీటి పంపిణీ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని తెలిపారు.
వీల్ చైర్లు, కమోడ్ వీల్ చైర్లు, నడుము పట్టీలు, మోకాలు పట్టీలు, వినికిడి పరికరాలు (చెవి మిషన్లు), వాకింగ్ స్టిక్ లు, చేతి కర్రలు వంటి వివిధ రకాల పరికరాలు జిల్లాకు మంజూరయ్యాయని వివరించారు. త్వరలోనే వీటిని గౌరవ అతిథుల సమక్షంలో అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, తదితరులు పాల్గొన్నారు.








