రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వచ్ఛత పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సమీకృత కార్యాలయాల సముదాయంలో డిస్టిక్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె ఈ సూచనలు చేశారు. స్వచ్ఛత హీ సేవ 2026 పోస్టర్లను కూడా ఆవిష్కరించారు.
మిషన్ భగీరథ అధికారులు మాట్లాడుతూ, నీటి నాణ్యత పర్యవేక్షణలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి ప్రతి నెలా 250 రసాయన పరీక్షల నమూనాలు, 50 బ్యాక్టీరియా పరీక్షల నమూనాలు సేకరిస్తున్నామని తెలిపారు.
స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లలో మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజల రద్దీ అధికంగా ఉండే దేవాలయాలు, బస్టాండ్లు, మార్కెట్లు, కొత్తగా నిర్మించిన వీవో బిల్డింగ్స్, అంగన్వాడి బిల్డింగ్స్ వద్ద స్వచ్ఛభారత్ మిషన్ నిధుల ద్వారా కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మించాలని సూచించారు. పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
మురుగునీటి నిర్వాహణ కోసం డ్రైనేజీ వ్యవస్థలను, సోక్ పిట్లను స్వచ్ఛభారత్ మిషన్ నిధుల ద్వారా నిర్మించాలని సూచించారు. వేములవాడ, సిరిసిల్ల డివిజన్లలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లకు స్థలాన్ని గుర్తించామని, పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అన్ని గ్రామాల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని, బట్ట సంచులను వాడే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. స్వచ్ఛత హీ సేవ 2026 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్న కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని, పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని పిలుపు నిచ్చారు.
గ్రామాలలో చెత్త పోగుబడే ప్రదేశాలను గుర్తించి, వాటిని శుభ్రపరిచి రంగులు వేయించాలని ఆదేశించారు. నీటి కుంటలు, చెరువులు, కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, ఎస్ బీ ఎం సురేశ్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.








