ధరూర్ క్యాంప్లో చేపట్టిన నూతన రహదారులు, తాగునీటి ట్యాంక్, పైప్లైన్ పనులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. రహదారి నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
ధరూర్ క్యాంప్ రామాలయం నుంచి మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాల వరకు నిర్మిస్తున్న నూతన రహదారి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం కొత్త బస్టాండ్లో చేపడుతున్న నూతన వాటర్ ట్యాంక్, పైప్లైన్ పనులను పరిశీలించారు. ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందేలా పనులను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
మెడికల్ కాలేజీ, ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు, తాగునీటి వసతి కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించవద్దని ప్రజలు మూడుసార్లు తిరస్కరించినా, కొందరు అధికారులు, వ్యక్తులు అభివృద్ధి పనులకు అడ్డు రావడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. జగిత్యాల పట్టణంలో నాణ్యతతో పనులు జరుగుతున్నాయని, వర్షం వల్ల బీటీ రోడ్డు దెబ్బతిన్నప్పటికీ, నాణ్యతతో పనులు పూర్తి చేస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఆలోచించి, తమ సహకారంతో జగిత్యాల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు.
జగిత్యాల మున్సిపల్ పరిధిలో దుకాణ సముదాయాల అద్దెలపై మున్సిపల్ కమిషనర్ నేటి మార్కెట్ లో ఉన్న విలువ ఆధారంగా సమీక్ష చేయాలని సూచించారు. అద్దె చెల్లించని వారికి నోటీసులు అందజేసి, సీజ్ చేస్తున్నారని తెలిపారు. కుల, మత, పార్టీలకు అతీతంగా జగిత్యాల పట్టణ అభివృద్ధిని అంతిమ లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ సత్య ప్రణవ్, ఆర్.బి డి ఈ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ ఛైర్మన్లు గోలి శ్రీనివాస్, టిపిసిసి సెక్రటరీ బండ శంకర్, కో ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, ఎస్సీ జిల్లా అధ్యక్షులు దుమల రాజ్ కుమార్, కౌన్సిలర్లు ప్రశాంత్ రావు, జుంబర్తి రాజ్ కుమార్, కోరుకంటి రాము, తిరుమలయ్య, చీటి లక్ష్మీనారాయణ, నాయకులు సుధాకర్ రావు, ప్రభాకర్, చందా పృథ్వీ, అరుముల్ల పవన్, కప్పల శ్రీకాంత్, రమేష్, స్వామి, ఈశ్వర్, మున్సిపల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.








