గణేశ్ నిమజ్జనోత్సవాన్ని శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు.
జగిత్యాలలోని చింతకుంట చెరువు, కోరుట్లలోని పెద్దవాగు, మెట్పల్లిలోని వట్టివాగు నిమజ్జన ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీ ప్రత్యక్షంగా పరిశీలించారు. నిమజ్జన ఘాట్ల వద్ద తాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం వంటి సౌకర్యాలు ఏర్పాటు కలెక్టర్ సూచించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని, నిమజ్జన ప్రాంతాల్లో స్థానిక గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించినట్లు చెప్పారు.
శోభాయాత్ర మార్గాల్లో ఇతర శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. నిమజ్జనం సందర్భంగా డీజేలు, సౌండ్ సిస్టమ్ల వినియోగం, బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని సూచించారు. చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని, చట్టవిరుద్ధంగా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణేశ్ నిమజ్జనోత్సవాన్ని శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.








