తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జన వేడుకలు విషాదాన్ని నింపుతున్నాయి. భారీ శబ్దాలు, డీజేల హోరు మధ్య శోభాయాత్రల్లో డ్యాన్స్ చేస్తూ పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో ఐదుగురు మరణించడం దిగ్భ్రాంతికరం.
నల్గొండ జిల్లా: మండలంలో గణేష్ శోభాయాత్రలో రాము (34) అనే వ్యక్తి డ్యాన్స్ చేస్తూ ఇంటి మెట్లపై కూర్చున్న కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ కాకర్లమూడు ఈసు అకస్మాత్తుగా మృతి చెందారు.
కర్నూలు జిల్లా: రూరల్ మండలం ఇ. తాండ్రపాడులో డీజే శబ్దాల తీవ్రత కారణంగా శివమ్మ (36) అస్వస్థతకు గురై గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల జిల్లా: డోన్ పట్టణంలో నిమజ్జన వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్లిన గణేశ్‌గౌడ్ (23) అనే యువకుడు గుండెపోటుతో మరణించారు.
శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో: సోమందేపల్లిలో శ్రీకాంత్ (35), గుత్తిలో అశోక్ కుమార్ (28) లు నిమజ్జన ర్యాలీల్లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. ఈ సంఘటనలు గణేష్ నిమజ్జనోత్సవాల్లో భద్రతా చర్యలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
వైద్యుల హెచ్చరికలు
భారీ శబ్దాలు కూడా ప్రాణాంతకమని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మనిషి గుండె 60-80 డెసిబుల్స్ శబ్దాన్ని మాత్రమే తట్టుకోగలదు. అయితే నిమజ్జనాల్లో వాడే డీజేలు 100 నుండి 120 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ తీవ్రమైన శబ్దాల ప్రకంపనల వల్ల గుండె లయ అస్తవ్యస్తమవుతుందని, దీనికి తోడు నిద్రలేమి, అధిక శారీరక శ్రమ తోడై కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నిర్వాహకుల తీరుపై విమర్శలు
అధిక శబ్దాల వల్ల ప్రాణాపాయం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నా, డీజేలపై నిబంధనలు ఉన్నా కొందరి నిర్వాహకుల తీరు మారడం లేదు. పోటీపడి మరీ ఇతర రాష్ట్రాల నుండి డీజేలు, భారీ సౌండ్ సిస్టమ్స్‌ను తీసుకొచ్చి నిమజ్జనాలు నిర్వహిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనల నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.










