అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చంద్రుడు మనదే అంటూ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇది అంతర్జాతీయ అంతరిక్ష చట్టాలకు, అనేక దేశాల అభిప్రాయాలకు విరుద్ధంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, భారతీయ సనాతన ధర్మం ప్రకారం విశ్వంలోని ఖగోళ వస్తువులపై ప్రాచీన విజ్ఞానం ముద్ర శాశ్వతంగా నిలిచి ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ట్రూత్ సోషల్ వేదికగా చంద్రుడు మనదే అంటూ అమెరికా జెండాతో కూడిన చిత్రాన్ని పోస్ట్ చేయడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. అపోలో మిషన్ల కాలం నుంచి చంద్రుని అన్వేషణలో అమెరికా అగ్రగామిగా ఉన్నప్పటికీ, ఈ ప్రకటన అంతర్జాతీయ అంతరిక్ష చట్టాలకు, సగానికి పైగా దేశాల అభిప్రాయాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది.
అంతర్జాతీయ చట్టాలు ఏమంటున్నాయి
1967 బాహ్య అంతరిక్ష ఒప్పందం ప్రకారం, అమెరికాతో సహా ఏ దేశమూ చంద్రుడిని లేదా ఇతర ఖగోళ వస్తువులను సొంతం చేసుకోకూడదు. చంద్రునిపై జెండా నాటడం, స్థావరాలు ఏర్పాటు చేయడం వల్ల ఏ దేశానికీ ఆ భూభాగంపై సార్వభౌమాధికారం లభించదు. భూభాగాన్ని క్లెయిమ్ చేయడాన్ని 1967 ఒప్పందం నిషేధించినప్పటికీ, వనరుల వెలికితీతపై స్పష్టత లేదు. ఈ లోటును పూరించడానికి అమెరికా 2015లో కమర్షియల్ స్పేస్ లాంచ్ కాంపిటిటివ్నెస్ యాక్ట్‌ను తెచ్చింది. దీని ప్రకారం భూభాగంపై యాజమాన్యం లేకుండానే, చంద్రునిపై వనరులను వెలికితీసే హక్కు అమెరికా పౌరులకు ఉంటుంది.
నాసా ఆధ్వర్యంలో 2020లో ప్రారంభమైన ఆర్టెమిస్ ఒప్పందాలపై నాటికి టర్కీతో కలిపి 71 దేశాలు సంతకం చేశాయి. శాంతియుత అన్వేషణ మరియు వనరుల వినియోగం కోసం ఇవి మార్గదర్శకాలుగా పనిచేస్తున్నాయి. 1979 మూన్ అగ్రిమెంట్ చంద్రుడిని మానవాళి ఉమ్మడి వారసత్వంగా ప్రకటిస్తుంది. అయితే అమెరికాతో పాటు ప్రధాన అంతరిక్ష శక్తులు దీనిపై సంతకం చేయలేదు.
సనాతన ధర్మం మరియు పురాణాల ప్రకారం ఖగోళ విజ్ఞానం
అమెరికా అధ్యక్షుని రాజకీయ ప్రకటనలు, అంతర్జాతీయ చట్టాలు ఒకెత్తయితే, భారతదేశపు అతి పురాతనమైన సనాతన ధర్మం మరియు పురాణాలు వివరిస్తున్న ఖగోళ విజ్ఞానం మరోకైవత్తని మేధావులు పేర్కొంటున్నారు. భారతదేశ సనాతన ధర్మ గ్రంథాలు, వేదాలు మరియు పురాణాలలో వేలాది సంవత్సరాల క్రితమే సూర్యుడు, చంద్రుడు మరియు నవగ్రహాల గురించి అత్యంత సూక్ష్మమైన శాస్త్రీయ సమాచారం స్పష్టంగా పొందుపరచబడి ఉంది. నాటి కాలంలోనే మన ఋషులు, శాస్త్రవేత్తలు అంతరిక్షం మరియు గ్రహాల గతుల గురించి అద్భుతమైన విజ్ఞానాన్ని అందించారు.
భారతీయ సనాతన ధర్మం ప్రకారం చూస్తే సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు సమస్త సృష్టికి, భూమండలానికి ఆధారమైనవి. ఏ గ్రంథాలు, పురాణాలు వెతికినా చంద్రుడు, సూర్యుడు మరియు నవగ్రహాల ప్రాధాన్యత గురించి సనాతన ధర్మంలో స్పష్టంగా వర్ణించబడి ఉంది. టెక్నాలజీ మరియు విజ్ఞాన పరంగా భారతదేశమే అన్నింటికంటే ముందు ఉండేదని, నాటి మన ప్రాచీన గ్రంథాల లోతుపాతులను అధ్యయనం చేయడం ద్వారానే నేడు ప్రపంచం సాంకేతికతను అందిపుచ్చుకుంటోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఆధునిక అంతర్జాతీయ చట్టాల ప్రకారం చంద్రుడు ఏ ఒక్క దేశానికి లేదా రాజకీయ అధినేతకు వ్యక్తిగతంగా చెందడు. కానీ, సనాతన ధర్మ పురాణాల ఆధారంగా విశ్వంలోని ప్రతి ఖగోళ వస్తువుపై మన ప్రాచీన విజ్ఞానం, సృష్టి సంబంధిత హక్కుల ముద్ర మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంది.



