తమ ప్రధాన డిమాండ్లు, షరతులు నెరవేరేంత వరకు కీలకమైన హర్మూజ్ జలసంధిని పునఃప్రారంభించే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ ఘలిబాఫ్ తమ వైఖరిని వెల్లడించారు. అమెరికా ఇకపై కాలయాపన చేయకుండా నిర్ణయం తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.
మధ్యవర్తుల ద్వారా అమెరికా కొన్ని తాజా ప్రతిపాదనలు పంపినప్పటికీ, వాటి పట్ల తమకు ఎలాంటి భయమూ లేదా ప్రత్యేక ఉత్సాహమూ లేవని స్పీకర్ ఘలిబాఫ్ వ్యాఖ్యానించారు.
కాలయాపన శకం ముగిసింది
సమయాన్ని వృథా చేస్తూ ఏకపక్ష డిమాండ్లను ఇతరులపై రుద్దే శకం ముగిసిపోయిందని అమెరికా గ్రహించాలి అని ఘలిబాఫ్ అన్నారు. ఇరాన్ వైఖరి స్పష్టంగా, నిశ్చయంగా ఉందని.. తమ ఏడు షరతులు నెరవేరే వరకు జలసంధి తెరుచుకోదని ఆయన తేల్చి చెప్పారు.
యుద్ధం, చర్చలు సమాంతరంగా
ఇరాన్ ప్రస్తుతం యుద్ధరంగంలో ఉంటూనే కొత్త వ్యూహాలతో ప్రత్యర్థులను ఎదుర్కొంటోందని, ఒకే సమయంలో పోరాటం మరియు చర్చలు రెండింటినీ సమర్థవంతంగా నిర్వహించగలదని తెలిపారు.
దౌత్య పరిష్కారానికి సిద్ధం
టెహ్రాన్‌లో విదేశీ రాయబారులు, దౌత్యవేత్తల సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ.. మమ్మల్ని మేము రక్షించుకోవడంలో ఎంత నిబద్ధతతో ఉన్నామో, దౌత్యపరమైన పరిష్కారాలను కనుగొనడంలోనూ అంతే నిబద్ధతతో ఉన్నాం అని తెలిపారు.
జలసంధి పునరుద్ధరణకు ఇరాన్ విధించిన షరతులను అమెరికా అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు అరాఘ్చి పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా మళ్లీ సైనిక చర్యలకు దిగితే, ఇరాన్ గతంలో కంటే మరింత సిద్ధంగా ఉందని, ఆత్మరక్షణ కోసం ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని హెచ్చరించారు.






