మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరుపై గ్రామాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల కోసం కేటాయించిన నిధులు కొందరికే చేరుతున్నాయని, చేసిన పనులకు కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదని, చేయని పనులకు కూడా నిధులు మళ్లించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, గత పదేళ్ల పథకం అమలు తీరుపై సమగ్ర ఆడిట్ నివేదికలను గ్రామసభలో బహిరంగపరచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పథకం ద్వారా ఏళ్ల తరబడి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, ఆ నిధుల అసలు ప్రయోజనం ఎవరికి దక్కింది పేద కూలీలకు ఎంత చేరింది పనుల ద్వారా మరెవరు లబ్ధి పొందారు అన్న ప్రశ్నలను గ్రామస్తులు లేవనెత్తుతున్నారు. మేము పని చేశాం.. కానీ మాకు రావాల్సిన డబ్బులు సక్రమంగా రాలేదని, కొందరు పని చేయకపోయినా వారి పేర్లు రికార్డుల్లో ఉన్నాయని, కొన్ని పనులు క్షేత్రస్థాయిలో కనిపించకపోయినా రికార్డుల్లో పూర్తయినట్లు చూపించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది అధికారిక రికార్డులు, సోషల్ ఆడిట్, గ్రామసభ వివరాలు, మస్టర్ రోల్స్, వేతన చెల్లింపులు, కొలతల పుస్తకాలు, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తేలాల్సి ఉంది.
పదేళ్ల ఆడిట్ నివేదికలు బహిరంగపరచాలి
ఉపాధి హామీ పథకం కింద గత పది సంవత్సరాల్లో గ్రామానికి ఎన్ని నిధులు వచ్చాయి ఎన్ని పనులకు అనుమతులు ఇచ్చారు ఏ పనికి ఎంత మొత్తం మంజూరైంది ఎంత ఖర్చు చేశారు ఎన్ని కుటుంబాలకు ఉపాధి కల్పించారు ఎన్ని రోజులు పని కల్పించారు కూలీలకు మొత్తం ఎంత వేతనం చెల్లించారు మెటీరియల్కు ఎంత ఖర్చు చేశారు ఎన్ని పనులు పూర్తయ్యాయి ఎన్ని పనులు మధ్యలోనే ఆగిపోయాయి అన్న ప్రశ్నలకు సంబంధించిన పూర్తి ఆడిట్ నివేదికలను గ్రామసభలో ప్రజల ముందుంచాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
నిధుల లబ్ధిదారులపై ప్రశ్నలు
ఉపాధి హామీ పథకం పేరు చెబితే ముందుగా గుర్తుకు రావాల్సింది గ్రామీణ కూలీ. ఎండలో, వానలో పనిచేసే పేద కూలీ కుటుంబానికి ఉపాధి కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అయితే సంవత్సరాల తరబడి నిధులు ఖర్చవుతున్నా, నిజంగా ఆ పథకం వల్ల ఎవరి జీవితాల్లో మార్పు వచ్చిందనే ప్రశ్నను ప్రజలు సంధిస్తున్నారు. పని చేసిన కూలీకి పూర్తి ప్రయోజనం దక్కిందా లేక పథకం పేరుతో మధ్యలో మరెవరైనా లాభపడ్డారా పేదల కోసం వచ్చిన డబ్బు నిజంగా పేదలకే చేరిందా అనే ప్రశ్నలకు అధికారులు స్పష్టమైన లెక్కలతో సమాధానం చెప్పాలని ప్రజలు కోరుతున్నారు.
మస్టర్ రోల్స్, వేతన చెల్లింపులపై స్పష్టత కోరుతూ
ఉపాధి హామీ పనుల్లో మస్టర్ రోల్ అత్యంత కీలకమైన రికార్డు. అందులో ఎవరు పని చేశారు ఎన్ని రోజులు పని చేశారు ఏ తేదీల్లో పని చేశారు ఎంత వేతనం పొందారు అన్న వివరాలు ఉండాలి. అందుకే గ్రామంలోని ప్రతి కూలీకి తన పేరుతో ఎన్ని రోజులు హాజరు నమోదు చేశారో తెలుసుకునే అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు మస్టర్లో ఉందా ఉంటే ఎన్ని రోజులు ఉంది నా పేరుతో ఎంత వేతనం చెల్లించారు ఆ డబ్బు నా ఖాతాలోనే జమైందా అనే ప్రశ్నలకు సమాధానాలు గ్రామసభలోనే ప్రజలకు అందుబాటులో ఉంచాలని వారు అంటున్నారు.







