వచ్చే ఏడాది శ్రీరామనవమి నాటికి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన ప్రాకారాలు, మాడ వీధుల పున:నిర్మాణ పనులు పూర్తి కావాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నిర్మాణ పనులను పరిశీలించారు.
మహబాద్ ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావ్, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నతో కలిసి మంత్రి పొంగులేటి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థప్రసాదాలు అందజేశారు.
వర్షంలోనూ పనుల పరిశీలన
బుధవారం ఉదయం నుంచి భద్రాచలం పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నప్పటికీ, ముందస్తు షెడ్యూల్ ప్రకారం మంత్రి పొంగులేటి దేవాలయానికి చేరుకున్నారు. దమ్మక్క అన్నదాన సత్రం నుంచి మెట్లదారి వరకు వర్షపు చినుకులు కురుస్తున్నా, బురదలోనే దేవస్థానం చుట్టూ కలియతిరిగి నేరుగా పనులను పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం నెలకొనొద్దని సూచనలు చేశారు.
అధికారులతో సమీక్ష
పనుల పరిశీలన అనంతరం భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
రూ.300 కోట్ల అభివృద్ధి పనులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూ.300 కోట్ల నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈనెల 4వ తేదీన పరిశీలించానని, మళ్లీ ఇప్పటివరకు జరిగిన పురోగతిని నేరుగా తెలుసుకునేందుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందేలా, సకాలంలో పనులు పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.












