జగిత్యాల పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, ప్రజా సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీసీ రోడ్ల ప్యాచ్‌వర్క్‌తో పాటు పండుగ ఏర్పాట్లకు నిధులు కేటాయించారు.
జగిత్యాల పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పారిశుద్ధ్య సేవలు అందించడమే లక్ష్యమని చైర్పర్సన్ శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ తెలిపారు. జగిత్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కౌన్సిల్ కృషి చేస్తుందని ఆమె పేర్కొన్నారు.
సమావేశం ప్రారంభంలో ఇటీవల మృతి చెందిన మున్సిపల్ కార్మికులు చాంద్ ఖాన్, కొండ్ర రవీందర్‌తో పాటు గతంలో మున్సిపాలిటీలో విధులు నిర్వహించిన రిటైర్డ్ ఉద్యోగి అవారి ఆనందం మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
పట్టణంలోని వివిధ వార్డుల్లో సీసీ రోడ్ల ప్యాచ్‌వర్క్ పనులకు రూ.50 లక్షలు కేటాయించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలకు, మున్సిపల్ శానిటేషన్ వాహనాల మరమ్మతులకు రూ.4 లక్షలు కేటాయించారు.
మున్సిపాలిటీకి చెందిన షాపులను అద్దెకు/లీజుకు ఇచ్చే ప్రక్రియలో భాగంగా, నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియను చేపట్టేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పారదర్శకంగా టెండర్ ప్రక్రియను నిర్వహించి, మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో భూముల వినియోగ మార్పు ( ) ప్రతిపాదనలపై కూడా చర్చ జరిగింది. రెసిడెన్షియల్ జోన్ నుంచి కమర్షియల్ జోన్‌గా, అలాగే రెసిడెన్షియల్ జోన్ నుంచి మిక్స్డ్ (రెసిడెన్షియల్ కమర్షియల్) జోన్‌గా మార్పు ప్రతిపాదనలను పరిశీలించి, ఉన్నతాధికారుల అనుమతుల కోసం తదుపరి చర్యలు చేపట్టడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
కౌన్సిల్ సభ్యులు తమ వార్డులకు సంబంధించిన ప్రజా సమస్యలు, అవసరాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చి చర్చించారు. సభ్యులు ప్రస్తావించిన సమస్యలను సంబంధిత అధికారులు గమనించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని చైర్పర్సన్ ఆదేశించారు.
పట్టణ ప్రజా అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి, పారిశుద్ధ్య పనులతో పాటు మున్సిపల్ కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలను కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో వైస్ చైర్పర్సన్ శ్రీమతి జీనత్ పర్వీన్ మునీరుద్దీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీ కె. సత్యప్రణవ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, డి.ఈ. అరుణ్, టి.పి.ఓ. శ్రీనివాస్, జే.ఏ.ఓ. గణేష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.







