మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల వివరాలను తగిన చర్యల కోసం స్పీకర్ ముందుంచాలని డీజీపీకి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. అసెంబ్లీ బయట ఘటన జరిగితే, తీసుకున్న చర్యల వివరాలను హైకోర్టు ముందుంచాలని ఆదేశించింది.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకోవడంతోపాటు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ఎల్పీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీచేసింది.
ప్రభుత్వ అప్లికేషన్‌పై విచారణ
అయితే, ఈ ఆదేశాలను సవరించాలని కోరుతూ ప్రభుత్వం అప్లికేషన్ దాఖలు చేసింది. స్పీకర్ ఆదేశాలను పోలీసులు అమలు చేశారని, చర్యలు తీసుకుంటే వారి నైతిక స్థైర్యం దెబ్బతింటుందని పేర్కొంది. ఈ అప్లికేషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ మాధవీదేవి ధర్మాసనం, అసెంబ్లీ లోపల ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరిగినా చర్యలు తీసుకునే అధికారం స్పీకర్దేనని స్పష్టం చేసింది.
మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి, ఆ వివరాలను తగిన చర్యల కోసం స్పీకర్ ముందుంచాలని సూచించింది. అసెంబ్లీ బయట, అంటే అసెంబ్లీలోకి ప్రవేశించే మార్గం వద్ద ఘటన జరిగి ఉంటే, తీసుకున్న చర్యల వివరాలను హైకోర్టు ముందుంచాలని డీజీపీకి ఆదేశాలు జారీచేసింది.












