దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం సూర్యాపేటలో ధర్నా కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు హాజరై జయప్రదం చేయాలని టీయూడబ్ల్యూజే, ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలో గురువారం టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో చలసాని శ్రీనివాస్ రావు మాట్లాడారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై గాంధీ జయంతి సందర్భంగా ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన అనంతరం కొత్త బస్టాండ్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంతరం సూర్యాపేట జిల్లా కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఆరోపణలు
ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటూ, అక్షరమే ఆయుధంగా జీవనాన్ని కొనసాగిస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆయన ఆరోపించారు. వృత్తిపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, బస్సు పాస్లో రాయితీతో పాటు వన్ బై థర్డ్ కాకుండా 50 బస్సు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక చట్టం డిమాండ్
పార్లమెంటరీ వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ వ్యవస్థగా పరిగణించే జర్నలిజం రంగానికి రక్షణ లేకుండా పోయిందని, జర్నలిస్టుల హక్కుల రక్షణకై జర్నలిస్టులపై దాడులను నియంత్రించే విధంగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో పాల్గొన్నవారు
ఈ సమావేశంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే ఐజేయూ) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి బత్తుల మల్లికార్జున్, సీనియర్ జర్నలిస్టులు సుంకర బోయిన వెంకటయ్య, కందుకూరి యాదగిరి, 99 షేక్ జహీర్, శిగ సురేష్, ఏబీఎన్ మల్లేష్, షేక్ రషీద్, గుడిపూడి రామకృష్ణ, కందుల నాగరాజు, ఉయ్యాల నరసయ్య, మాదగోని వేణు, పల్లె మణి బాబు, బిగ్ టీవీ రామకృష్ణ, కొండ్లె కృష్ణయ్య, తండు వెంకన్న, ఏబీఎన్ మల్లేష్, మహా న్యూస్ సురేందర్, దుర్గం బాలు, యో యో టీవీ శంకర్, వల్దాస్ శంకర్, పాషా, తదితరులు పాల్గొన్నారు.












