మండలంలోని భూపతిపూర్ గ్రామాన్ని ట్రైనీ కలెక్టర్ కుమారి హరిణి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని దుర్గామాత వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, పంచాయతీ రికార్డులను పరిశీలించారు.
గ్రామపంచాయతీ నిర్వహణ, రికార్డుల పరిరక్షణ, గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలపై ట్రైనీ కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు.
అలాగే గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులతో సమావేశమై వారి సంఘాల రికార్డులను పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, స్వయం సమృద్ధి సాధించే దిశగా కృషి చేయాలని ఆమె సూచించారు.
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుర్రం భావన మహేందర్ గౌడ్, ఉప సర్పంచ్ మూగల సంజీవ్ చారి ట్రైనీ కలెక్టర్ హరిణి, ఎంపీడీవో చిరంజీవిలను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆదిత్య రాజ్, మహిళా సంఘాల సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












