గ్రామ పంచాయతీల్లో చెక్కుల చెల్లింపులకు అడ్డంకులు లేకుండా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు ఈ మేరకు ఉత్తర్వులు వెళ్లాయి. బిల్లుల చెల్లింపుల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ల మధ్య పంచాయితీకి చెక్ పెట్టేలా ఈ చర్యలు చేపట్టారు.
చెక్కులపై సంతకాలు చేయడంలో ఉప సర్పంచ్లు జాప్యం చేస్తే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ అయ్యాయి. కారణం లేకుండా ఏడు రోజులకు మించి జాప్యం చేస్తే కలెక్టర్ విచారణ చేపట్టాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కారణం లేకుండా ఏడు రోజులకు మించి జాప్యం చేస్తే, ఉప సర్పంచ్ల స్థానంలో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓ, ఎంపీడీవోలలో ఒకరికి జాయింట్ చెక్ పవర్ ఇచ్చేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు గ్రామ పంచాయతీల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు.












