గ్రామ పంచాయతీల్లో చెక్కుల చెల్లింపులకు అడ్డంకులు లేకుండా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు ఈ మేరకు ఉత్తర్వులు వెళ్లాయి. బిల్లుల చెల్లింపుల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ల మధ్య తలెత్తే వివాదాలకు చెక్ పెట్టేలా ఈ ఆదేశాలు ఉన్నాయి.
చెక్కులపై సంతకాలు చేయడంలో ఉప సర్పంచ్లు కారణం లేకుండా జాప్యం చేస్తే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ అయ్యాయి. కారణం లేకుండా ఏడు రోజులకు మించి జాప్యం జరిగితే, కలెక్టర్ విచారణ చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
కారణం లేకుండా ఏడు రోజులకు మించి జాప్యం చేస్తే, ఉప సర్పంచ్ల స్థానంలో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓ, ఎంపీడీవోలలో ఒకరికి జాయింట్ చెక్ పవర్ ఇచ్చేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనివల్ల గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు.












