రాబోయే దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ () ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ వేళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్టాండ్లలో పెరిగే తీవ్ర రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఒక నూతన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు లేదా ఒకే ప్రాంతానికి చెందిన 30 మంది ప్రయాణికులు ఒక గ్రూప్‌గా ఏర్పడి ముందస్తుగా బుకింగ్ చేసుకుంటే, ఆర్టీసీ బస్సు నేరుగా వారి నివాసాల వద్దకే వచ్చి పికప్ చేసుకుంటుంది. హాస్టళ్లు, కళాశాలల్లో ఉండే విద్యార్థులు తమ సొంతూళ్లకు సురక్షితంగా వెళ్లేందుకు వీలుగా కళాశాల ప్రాంగణాలు, హాస్టళ్ల వద్ద నుంచే ప్రత్యేక బస్సు సేవలను ప్రారంభించనున్నారు.
ఈ సదుపాయం వల్ల ప్రయాణికులు భారీ లగేజీతో ఎంజీబీఎస్, జేబీఎస్ లేదా ఉప్పల్, ఎల్బీనగర్ వంటి ప్రధాన ప్రాంతాల వరకు వెళ్లి రద్దీలో వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఇది ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది.
బుకింగ్ వివరాలు
ఈ ప్రత్యేక బస్సుల బుకింగ్స్, ఇతర సమాచారం కోసం ప్రయాణికులు క్రింది హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఆర్టీసీ కాల్ సెంటర్: 040-69440000 / 040-23450033. జేబీఎస్ జోనల్ కమ్యూనికేషన్ సెల్: 9959226160. అధికారిక వెబ్సైట్: ..
ప్రయాణికులందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా సాగించాలని టీజీఎస్ఆర్టీసీ సూచించింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.











