జగిత్యాల అభివృద్ధి పనులకు సీనియర్ నాయకులు అడ్డం పడుతున్నారని, వారి స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విమర్శించారు. నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ స్థల సేకరణ ఒక స్కాం అని, జీఎస్టీ పెంపుతో మెడికల్ కాలేజీ పనులపై భారం పడిందని ఆయన ఆరోపించారు.
జగిత్యాల ప్రెస్ క్లబ్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్యతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. జగిత్యాల అభివృద్ధి చేస్తుంటే సీనియర్ నాయకులు వారి స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో భూమిపూజ చేసిన సీనియర్ నాయకులకు కనీసం రహదారి, పేపర్ కూడా లేకపోవడం విడ్డూరంగా ఉందని, కాలనీలో డ్రైనేజీ వెళ్లే పరిస్థితి లేదని విమర్శించారు.
నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ స్థల సేకరణ ఒక స్కాం అని, స్థలం నిరుపయోగంగా మారిందని, మాజీ ఎంపీ కవిత గారి సహకారంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు భూమిపూజ చేయడం జరిగిందని తెలిపారు. జీవన్ రెడ్డి రెచ్చగొట్టే మాటలతో జగిత్యాల అభివృద్ధి పనులకు అడ్డం పడుతున్నారని ఆయన ఆరోపించారు.
కేంద్రం జీఎస్టీ పెంచడం వల్ల 8 కోట్ల అదనపు భారం మెడికల్ కాలేజీ పనులపై పడిందని అన్నారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి, ప్రభుత్వం తో ఉన్న 7 నెలల సమయంలో మెడికల్ కాలేజీ, అర్బన్ హౌసింగ్ కాలనీ పనులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని, అవసరమైతే సభ్యత్వం తీసుకుంటానని తెలిపారు.
మెడికల్ కాలేజీకి పాత బకాయిలు 40 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, నాలుగు వైపులా డబుల్ రోడ్డు మంజూరు చేసి, పనులు కూడా జరుగుతున్నాయని చెప్పారు. సంజయ్ జీవితం జగిత్యాల ప్రజలకు ఒక తెరచిన పుస్తకమని, తనకు పేరు వస్తుందనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
రోల్లవాగు ప్రాజెక్ట్ అటవీ అనుమతుల కారణంగా ఆలస్యం అవుతోందని, ముంపునకు గురవుతున్న 827 ఎకరాల అటవీ భూమికి బదులుగా రెవెన్యూ భూమి ఇవ్వడం ద్వారా అటవీ అనుమతుల ప్రక్రియ ప్రారంభం అయిందని తెలిపారు. అటవీ శాఖకు ఇంకా కొంత రెవెన్యూ భూమి కోసం సర్వే జరుగుతోందని చెప్పారు.
మెడికల్ కాలేజీ పనులు కొంత ఆలస్యం అయ్యాయని, వైద్య విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారని తెలిపారు. తాను కలెక్టర్ గారిని కలిసి మాట్లాడగా, వారు సన్మానం చేశారని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని, ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారని తెలిపారు. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.
200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వెజ్, నాన్-వెజ్ మార్కెట్ త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అభివృద్ధికి అడ్డం పడాలనే అజెండాతో విమర్శలు చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ అడువల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం, బండ శంకర్, కో ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు దుమల రాజ్ , జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుసరి అనిల్, సభ్యులు కత్రోజ్ గిరి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీరం రాజేష్, కాంగ్రెస్ సేవాదళ్ స్టేట్ సెక్రటరీ ముకేష్ ఖన్నా, టౌన్ యూత్ అధ్యక్షులు దయల శరత్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.











