రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలంలో విద్యుత్ సరఫరా సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోర్లలో నీరు ఉన్నా, సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితి నెలకొందని కర్రెడ్ల నరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బోరు పనిచేస్తే మరో బోరు పనిచేయకపోవడం, తరచూ విద్యుత్ అంతరాయాలు సాగులో నష్టాలకు కారణమవుతున్నాయని తెలిపారు.
రైతులు అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే వారి బాధ వర్ణనాతీతమని కర్రెడ్ల నరేందర్ రెడ్డి అన్నారు. నీరు ఉన్నా విద్యుత్ లేక పంటలకు నీరందని పరిస్థితి ఉంటే రైతులు ఎలా బతకాలని ఆయన ప్రశ్నించారు. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
రైతే రాజు అని చెప్పే పాలకులు.. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి పరిష్కరించాలని కర్రెడ్ల నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం మాటలకే పరిమితం కాకుండా, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను సకాలంలో అందించాలని కోరారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయాలను నివారించి, రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాలని, పంటలు ఎండిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే పంట నష్టాలను ఎదుర్కొన్న రైతులను గుర్తించి తగిన సహాయం అందించాలని కోరారు.
రైతుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తే రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. రైతును కాపాడాలి.. వ్యవసాయాన్ని నిలబెట్టాలి అని ఆయన పిలుపునిచ్చారు.












